CM Vijay : తమిళనాడు సీఎం విజయ్‌కు ఆ రాష్ట్ర ఎంపీలు పెద్ద షాక్ ఇచ్చారు. డీ లిమిటేషన్ బిల్లుపై చెన్నైలో విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 20 మంది ఎంపీలు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. అంటే, 37 మంది ఎంపీలు మీటింగ్‌కు హాజరుకాలేదు. పార్లమెంట్లో తమిళనాడుకు 57 మంది ఎంపీలున్నారు. వీరిలో 39 మంది లోక్‌సభ ఎంపీలు, 18 మంది రాజ్యసభ ఎంపీలు. తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి ఒక్క ఎంపీ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు.
పార్లమెంట్లో కేంద్రం డీ లిమిటేషన్ బిల్లును సోమవారం ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును వ్యతిరేకిస్తామని తమిళనాడు అధికార టీవీకే ఇంతకుముందే ప్రకటించింది. అలాగే, తాము కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తామని డీఎంకే కూడా శనివారం ప్రకటించింది. ఇతర తమిళ పార్టీలు కూడా దాదాపు ఇదే వైఖరితో ఉన్నాయి. ఏఐఏడీఎంకే నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది. ఈ బిల్లుపై చర్చించాలని సీఎం విజయ్.. తమిళనాడు ఎంపీలో శనివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి టీవీకే కూటమి పార్టీ అయిన కాంగ్రెస్‌తోపాటు చిన్న పార్టీలే హాజరయ్యారు. 12 మంది కాంగ్రెస్ ఎంపీలు, వీసీకే నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఇద్దరు, ఎండీఎంకే నుంచి ఒకరు, ఐయూఎంఎల్ నుంచి ఒకరు మాత్రమే సమావేశానికి వచ్చారు. వీరంతా టీవీకేతో తమిళనాడులో పొత్తులో ఉన్నవారే.
ఇక, ప్రతిపక్ష డీఎంకే.. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. కావేరి అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విజయ్ ఈ సమావేశం ఏర్పాటు చేశాడని ఆరోపించింది. పీఎంకే, ఎంఎన్ఎం, డీఎండీకే పార్టీలు కూడా విజయ్ నిర్వహించిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. పార్లమెంట్లో డీఎంకే పార్టీకి 30 మంది ఎంపీలున్నారు. తమిళనాడు నుంచి అత్యధికమంది ఎంపీలున్న పార్టీ కూడా ఇదే. అలాగే, ఏఐఏడీఎంకేకు నలుగురు, పీఎంకే పార్టీకి ఒక ఎంపీ, ఎంఎన్ఎం పార్టీకి ఒక ఎంపీ, డీఎండీకేకు ఒక ఎంపీ ఉన్నారు.