హైదరాబాద్ : నదీ జలాల్లో ( Water Rights ) కేంద్రమైనా, రాష్ట్రమైనా నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తే, తెలంగాణ ఉద్యమానికి మించి మరొక ఆందోళన ( Agitation ) తెలంగాణలో వస్తుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని నందినగర్‌లో మీడియాతో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వచ్చేవారం జరిగే జీఆర్ఎంబీ ( BRMB ) సమావేశం ఎజెండా ఎందుకు అంగీకరించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం ఎజెండా పూర్తిగా తెలంగాణ హక్కులను కాల రాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కులను ఏ విధంగా కాపాడతారో రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్ ని సలహాదారుగా పెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. తెలంగాణలో ఒక్క ఇంజనీర్ కూడా లేరా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చెప్పుచేతల్లోకి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు చెప్పు చేతల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. రేవంత్ రెడ్డికి సిగ్గుంటే ఆదిత్యనాథ్ దాస్ ని తొలగించాలని డిమాండ్ చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలతో కొట్లాడిన తెలంగాణలో మరోసారి నీళ్ల దోపిడీకి తెలంగాణ గురవుతున్నదని, ఇదే జరిగితే కచ్చితంగా బీఆర్ఎస్ మరోసారి నీళ్ల కోసం ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని సూచించారు. నార్లాపూర్‌ను ముట్టడించి పంపులను ఆన్ చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలకు ప్రభుత్వం దిగివచ్చి పంపులని ఆన్ చేసిందని వెల్లడించారు.
పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి పాలమూరు నీళ్లు ఇచ్చే సోయి లేదు. వర్షాలు పడి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తి పోసుకుంటే ముఖ్యమంత్రికి పట్టింపు లేదు. ప్రధాన ప్రతిపక్షం ముళ్లు కట్టెతో పొడిస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది లేదంటే నిద్రపోతున్నదని పేర్కొన్నారు.