హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వర్తించిన న్యాయసూత్రాలే మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకూ వర్తిస్తాయా? కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కడియం శ్రీహరితోపాటు క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ పదవి పొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై కూడా వేటు పడుతుందా? దానం కేసు విషయంలో హైకోర్టు పరిగణనలో కి తీసుకున్న విషయాలు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తాయా? రాజకీయ, న్యాయవర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, టీ ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, ఎం సంజయ్‌కుమార్ అనర్హత విషయంలో దాఖలైన పిటిషన్లపై అక్టోబర్ 6న హైకోర్టు విచారణ జరుగనున్నది. దానం నాగేందర్ కేసులో హైకోర్టు నిర్దేశించిన న్యాయసూత్రాల ప్రకారం ఈ ఎనిమిది మందిపై వేటు తప్పదన్న చర్చ నడుస్తున్నది. దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం, బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటి చర్యలను హైకోర్టు కీలకంగా పరిగణించింది.
ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారా? లేదా? అనేది నిర్ధారించేందుకు అధికారిక రాజీనామా ఒక్కటే ఆధారం కాదని, ఆ వ్యక్తి అసెంబ్లీ వెలుపల చేసిన రాజకీయ చర్యలను కూడా పరిశీలించవచ్చని స్పష్టం చేసింది. ఆర్టికల్ 191(2)తోపాటు పదో షెడ్యూల్లోని 2(1)(ఏ) కింద దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడని తేల్చింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని పేర్కొన్నది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు స్పష్టం చేసింది. సభ వెలుపలి రాజకీయ కార్యకలాపాలకూ ప్రాధాన్యం ఉంటుందన్న ఈ న్యాయసూత్రమే ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేల కేసుల్లో కీలకంగా మారనున్నది.
ఫిరాయింపుల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యాన్ని సుప్రీంకోర్టు 2025 జూలై 31న పరిశీలించిన విషయాన్ని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. అనర్హత పిటిషన్లను వీలైనంత త్వరగా, ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాల తేదీ నుంచి మూడు నెలల్లోగా తేల్చాలని స్పీకర్‌కు నిర్దిష్ట గడువు విధించిన విషయాన్ని గుర్తుచేసింది. పదో షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని, ఆయన నిర్ణయం హైకోర్టు న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో దానం కేసును తిరిగి స్పీకర్‌కు పంపితే మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున అలా చేయడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దానంపై అనర్హత పిటిషన్‌ను కొట్టివేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసిన హైకోర్టు.. ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపుదారుల కేసుల్లో హైకోర్టు సత్వరమే విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పే అవకాశాలు ఉన్నాయి.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు అమలును నిలిపివేసి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సమయం ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. మరోవైపు, దానం పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరుతూ బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.
దానం అప్పీల్ నేపథ్యంలో తెలంగాణ శాసనమండలి సభ్యుడు ఆర్ భూపతిరెడ్డి అనర్హత కేసు కూడా చర్చకు వస్తున్నది. భూపతిరెడ్డి అనర్హతను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు 2020 జనవరి 7న నిరాకరించిన విషయాన్ని న్యాయవర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన న్యాయసూత్రాలు, మార్గదర్శకాల నేపథ్యంలో స్పష్టమైన ఆధారాలున్న కేసుల్లో అనర్హతకు గురైన చట్టసభ సభ్యులకు న్యాయపరంగా వెసులుబాటు లభించే అవకాశాలు పరిమితమేనని న్యాయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మిగతా ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ మరింత పెరిగింది. దానం అనర్హతతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో.. మిగతా ఎనిమిది మందిపై కూడా అనర్హత వేటు పడితే ఆయా స్థానాల పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. హైకోర్టు తన తీర్పులో కిహిటో హోలోహాన్, డాక్టర్ మహాచంద్రప్రసాద్సింగ్, రాజేంద్రసింగ్ రాణా, రవి ఎస్ నా యక్, జీ విశ్వనాథన్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయసూత్రాలను ప్రస్తావించింది.
ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యుడు మరో పార్టీతో రాజకీయ అనుబంధం ఏర్పరచుకొని, ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం వంటి చర్యలు స్వచ్ఛందంగా తన అసలు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టుగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. డాక్టర్ మహాచంద్రప్రసాద్సింగ్ కేసులోనూ ఇదే సూత్రం ఆధారంగా అనర్హతను సమర్థించిన విషయాన్ని ప్రస్తావించింది.
దానం నాగేందర్ విషయంలోనూ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం పదో షెడ్యూలులోని 2(1)(ఏ) పరిధిలోకి వస్తుందని తేల్చింది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా, విపరీత ధోరణితో ఉన్నప్పుడు న్యాయసమీక్షకు అవకాశం ఉంటుందని కిహిటో హోలోహాన్ తీర్పు నిర్దేశించిన సూత్రాన్ని కూడా ధర్మాసనం వర్తింపజేసింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలోనూ ప్రాధాన్యత సంతరించుకొన్నది.
అదే సమయంలో, ఈ కేసులో హైకోర్టు చేసిన మరో కీలక వ్యాఖ్య పదో షెడ్యూలు కింద అనర్హత విచారణను సాధారణ సివిల్ లేదా క్రిమినల్ కేసుల విచారణతో పోల్చరాదు అన్నది. అనర్హత పిటిషన్‌ను సాధారణ వ్యాజ్యంలా చూస్తూ ప్రతి అంశానికీ కఠినమైన సాక్ష్యాధార ప్రమాణాలు, సాంకేతిక ప్రక్రియలు వర్తింపజేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. స్పీకర్ తన ముందున్న విశ్వసనీయమైన అధికారిక రికార్డులు, ఎన్నికల అఫిడవిట్లు, నామినేషన్ పత్రాలు, ఇతర సంబంధిత ఆధారాలను స్వతంత్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నది.
దీంతో దానం తీర్పు తర్వాత మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లలో కూడా ఇదే న్యాయ ప్రమాణాలు ఎలా వర్తిస్తాయన్నదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దానం తీర్పు తర్వాత మిగిలిన ఫిరాయింపుదారుల కేసులో హైకోర్టు వెలువరించబోయే తీర్పుపైనే కాంగ్రెస్ కౌగిలిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుతోపాటు రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషిస్తున్నారు.