హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కౌరవ పాలనను మరిపిస్తున్నది. ప్రజల భద్రత, వారి మానప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే దుశ్శాసనుల్లా వ్యవహరిస్తున్నారు. డబ్బు, అధికార మదంతో విర్రవీగుతున్న కొందరు కన్నూమిన్నూ కానకుండా కామాంధులుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణలో నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మిస్ ఇంగ్లాండ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడొకరు లైంగికంగా వేధింపులకు గురిచేసిన విషయం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీశారు.
ఇప్పుడు తాజాగా ప్రభుత్వంలోని ఓ కాంట్రాక్టు కోసం వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తను సైతం లైంగికంగా లొంగదీసుకొనే ప్రయత్నం చేశా రు. అయితే, ఆ మహిళ గుండె నిబ్బరంతో నిలబడ్డారు. తన పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ సామాజిక మాధ్యమాల ద్వారా ఏకంగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశారు. తాను కాంట్రాక్టు కోసం చేయని ప్రయత్నం లేదని, ఒక మహిళగా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన తనను లోబర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని, తన నిస్సహయతను వాడుకోవద్దంటూ ఆమె సామాజిక వేదిక ‘ఎక్స్’లో పెట్టిన పోస్టులో తన బాధను వ్యక్తంచేశారు. ఆ మహిళ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.
తాను ఔత్సాహిక పారిశ్రామికవేత్తనని, కరోనా సమయంలో తాను అడ్వైర్టెజ్‌మెంట్ ఏజన్సీని ప్రారంభించినట్టు నగరానికి చెందిన కే శోభారెడ్డి పేర్కొన్నారు. తొలుత ఉద్యోగిగా ఉన్న తాను తర్వాత సొంతంగా ‘మిథున అడ్వైర్టెజింగ్’ పేరుతో అవుట్డోర్ అడ్వైర్టెజ్‌మెంట్ ఏజెన్సీని నడుపుతున్నట్టు ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అడ్వైర్టెజ్‌మెంట్ రంగంలో అవకాశాల కోసం తాను ప్రయత్నాలు చేస్తున్నానని, గడిచిన 15 ఏండ్లుగా తాను ఈ రంగంలో ఉన్నానని చెప్పారు.
గడిచిన మూడేండ్లుగా అడ్వైర్టెజ్‌మెంట్ కాంట్రాక్టుల కోసం తాను స్వయంగా ప్రభుత్వంలోని అధికారుల చుట్టూ అనేకసార్లు తిరిగానని చెప్పారు. అధికారుల వల్ల కాదని తెలుసుకొని, తనకున్న పరిచయాల ద్వారా రాజకీయ నేతలను సంప్రదించానని ఆమె చెప్పారు. ఈ క్రమంలో తాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఫహీం ఖురేషీ, వేం నరేందర్‌రెడ్డి తదితరులందరితో మాట్లాడానని చెప్పారు. ఎక్కడి నుంచి కూడా అనుకున్న మేరకు మద్దతు లభించలేదని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎంకు అత్యంత సన్నిహితుడిగా ఉంటారని పేరున్న మరో నేతను కలిశానని, ఆయన వద్దకు చాలాసార్లు వెళ్లానని, కానీ, కాంట్రాక్టులు ఇప్పించలేదని పేర్కొన్నారు.
అడ్వైర్టెజ్‌మెంట్ కాంట్రాక్టులు దక్కాలంటే డబ్బులు ఇవ్వాలని, ఇవ్వలేకపోతే గెస్టుహౌస్‌కు వచ్చి మాట్లాడాలని తనతో సీఎంకు దగ్గరగా ఉండే ఆ నేత చెప్పారని బాధిత మహిళ పేర్కొన్నారు. తాను ఎంతకూ లొంగకపోవడంతో కనీసం తనతో కలిసి బీఎండబ్ల్యూ కారులో 15 నిమిషాలు షికారుకు రావాలని, అలా వస్తేనే పని అవుతుందని ఆయన తేల్చిచెప్పారని తెలిపారు. ఆ నేత చెప్పిన మాటలతో తాను షాక్‌కు గురయ్యానని, తన నిస్సహయతను వాడుకోవాలని ఆయన అనుకొన్నారని, తనను కలిస్తే పని అవుతుందని, మున్సిపల్ శాఖ కూడా చూసే సీఎం అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తానంటూ తనకు మాయమాటలు చెప్పే ప్రయ త్నం చేశారని పేర్కొన్నారు. ఇక పనిచేస్తామని చెప్పినవాళ్లు తనను లొంగదీసుకునే ప్రయత్నం చేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
మున్సిపల్ శాఖలో ముఖ్యమంత్రి పేరు చెప్పి కొందరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని శోభారెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ చెప్పారు. నచ్చినవారికి నచ్చిన కాంట్రాక్టులు వస్తున్నాయని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకొన్న తనలాంటి వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ శాఖలో జరుగుతున్న ప్రతి అంశంపై తన వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉన్నదని శోభారెడ్డి తెలిపారు. సమాచార హక్కుచట్టం ద్వారా మొత్తం సమాచారాన్ని తాను తెప్పించానని, తనకు వేరే ఏ ఉద్దేశం లేకపోవడంతో వాటిని మీడియాకు ఇవ్వడంలేదని పేర్కొన్నారు.
తనను గెస్టుహౌస్‌కు రమ్మన్నది, కారులో వెళ్దామంటూ అడిగిన వ్యక్తి వివరాలను తాను ఇప్పుడే బయటపెట్టబోనని, సీఎంకు అత్యంత సన్నిహితుడిగా ఉండే వ్యక్తే అని, ఆయన పెట్టిన మెసేజ్‌లు, కాల్‌డేటా తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఆ నేత అలాంటి వాడని తాను ఊహించలేకపోయానని, పళ్లై, పిల్లలున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తనైన తనతోనే ఇలా ప్రవర్తించారంటే సాధారణ మహిళల పరిస్థితిని తల్చుకొంటేనే భయంగా ఉన్నదని వాపోయారు.
అపాయింట్మెంట్ ఇస్తే సీఎంకే చెప్తా తనను గెస్టుహౌస్‌కు పిలిచిన వ్యక్తి వివరాలను ఎవరికీ చెప్పదల్చుకోలేదని, నేరుగా సీఎంకే చెప్తానని, అందుకే తాను ఎక్స్‌లో పోస్టు చేశానని బాధిత మహిళ పేర్కొన్నారు. ఆ వ్యక్తికి ఇప్పటికే తెలిసి ఉంటుందని తెలిపారు. ఎక్స్‌లో తాను చెప్పిన విషయాలే కాకుండా, ఇంకా అనేక అంశాలున్నాయని, వాటన్నింటినీ సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకే నేరుగా వివరిస్తానని చెప్పారు. సీఎంకు, ముఖ్యమైన వాళ్లకు మాత్రమే తెలిసేలా ఎక్స్‌లో పోస్టు పెట్టానని, కానీ, తాను పెట్టిన పోస్టుపై విపరీతమైన విచారణలు జరుగుతున్నాయని తెలిపారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. అందరి ఫోన్లతో తనకు కాళ్లూచేతులు ఆడటంలేదన్నారు. ఎవరినీ బ్లేమ్ చేయడం లేదని తెలిపారు.
తానేమీ అన్యాయంగా, బ్యాక్‌డోర్‌లో తనకు ఉపయోగపడే పనులు చేయాలని అడుగలేదని శోభారెడ్డి చెప్పారు. అవుట్డోర్ ప్రకటనల విభాగంలో న్యాయ, చట్టబద్ధమైన అవకాశాల కోసమే తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చేలా రెవెన్యూ షేరింగ్ ప్రతిపాదనలు పెట్టినా పట్టించుకోలేదని, ఈ క్రమంలో తన సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తారనే నమ్మకంతో.. సీఎంకు అత్యంత ఆప్తుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తిని కలిసి ప్రతిపాదనలు చెప్పానని తెలిపారు. అయితే, తన సమస్యను విని పరిషరించాల్సింది పోయి.. ఆ వ్యక్తి తనను నేరుగా గెస్ట్‌హౌస్‌కు రమ్మని ఆహ్వానించాడని ఆరోపించారు.
జీవో ఎంఎస్ నంబర్ 68 ప్రకారం ప్రకటనల బోర్డులు, యాడ్ ఏజెన్సీలకు కఠిన నిబంధనలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీకి అత్యంత చేరువగా ఉండే కొందరు ప్రకటనల వ్యాపారులకు, పైలట్ ప్రాజెక్టుల పేరుతో, జీవో 68 నుంచి ప్రత్యేక మినహాయింపులు ఇస్తూ నిబంధనలను పకనపెడుతున్నారని శోభారెడ్డి ఆరోపించారు. కొందరి నిర్మాణాలపై నిబంధనల ఉల్లంఘనల కింద నోటీసులు జారీచేసినా, వివాదాలు పరిషారం కాకపోయినా ఇప్పటికీ అవే ప్రకటనల బోర్డులు యథేచ్ఛగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.
టెండర్లు పిలిచే వరకు తాతాలిక ప్రాతిపదికన అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వానికి ఆదాయం ఇస్తామని అర్జీలు పెట్టుకున్న సాధారణ ఏజెన్సీలను మాత్రం నిబంధనల పేరుతో తిరసరిస్తున్నారని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని ప్రభు త్వం చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయి అవకాశాలు చూస్తే.. నకకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనేది ఈ ఘటన ద్వారా స్పష్టమవుతున్నది. ఈ అక్రమాలపై సీఎం కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుంది? అన్నది చర్చనీయాంశంగా మారింది.