హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులు అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల్లో అత్యధికులు యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలనే ఎంచుకుంటున్నారు. అఫిలియేటెడ్ కాలేజీలను పక్కనపెట్టి.. క్యాంపస్ కాలేజీల్లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది సీపీగెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది. దీంతో అఫిలియేటెడ్ కాలేజీ (ప్రైవేట్)ల్లో అడ్మిషన్లు డల్‌గా మారాయి. ఈ కాలేజీల్లో విద్యార్థులు చేరేందుకు అంతగా ఇష్టపడటం లేదు. క్యాంపస్ కాలేజీల్లో మంచి వసతులు, ల్యాబ్లుండటం, అదే ప్రైవేట్ కాలేజీల్లో వసతులు లేకపోవడంతో ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈసారి పీజీ మొదటి సంవత్సరంలో ఓయూ క్యాంపస్ కాలేజీల్లో 100శాతం సీట్లు నిండాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 10శాతం అదనంగా సీట్లుండగా, ఈ కోటా సీట్లు కూడా పూర్తిగా భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పీజీ ఫస్టియర్‌లో 43,125 సీట్లుంటే.. 17,586 మంది విద్యార్థులు మాత్రమే సీట్లు దక్కించుకున్నారు. ఏకంగా 25,539 సీట్లు ఖాళీగా ఉన్నాయి. భర్తీ అయిన 17వేల సీట్లల్లో దాదాపు 6వేల సీట్లు క్యాంపస్ కాలేజీల్లోనూ భర్తీకావడం గమనార్హం. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో 800 సీట్లకు 757, సైఫాబాద్ పీజీ కాలేజీలో 265కు 261 సీట్లు నిండాయి. కామర్స్ కాలేజీలో 160, సైన్స్ కాలేజీలో 978, నిజాం కాలేజీలో 448 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజీల్లో సీట్ల భర్తీ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఓయూలో అత్యధికంగా 11,917 సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. వీటిలో కేవలం 4,652 సీట్లు మాత్రమే నిండాయి. కేయూ పరిధిలో 8,090 సీట్లుంటే కేవలం 1,512 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పాలమూరు వర్సిటీలో 1,660 సీట్లకు 421 మాత్రమే నిండాయి.మహాత్మాగాంధీ అఫిలియేటెడ్ కాలేజీల్లో 1,760 సీట్లుకు కేవలం 381 మాత్రమే నిండాయి. శాతవాహనలో 4,440 సీట్లకు 1,244 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.తెలంగాణ వర్సిటీ పరిధిలో 4,120 పీజీ సీట్లుండగా.. కేవలం 874 మాత్రమే నిండాయి.
