Farmers Protest | రాయపోల్, మే 25 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీ రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ గజ్వేల్ – చేగుంట ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు.
అనంతరం రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాయపోలు ఎస్ఐ మానస అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.
సమస్యను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎస్ఐ మానస హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలు గ్రామాలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
