Rakshitha Suresh | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, జగపతిబాబు, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ‘హల్లల్లల్లో’ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. పాటలోని మాస్ బీట్స్, ఫోక్ టచ్, చరణ్-జాన్వీ కెమిస్ట్రీతో పాటు ఒక ప్రత్యేకమైన అంశం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా, తన ప్రత్యేకమైన గాత్రంతో రక్షిత సురేష్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా ఈ సాంగ్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది. పాట విడుదలైన వెంటనే “ఈ కొత్త వాయిస్ ఎవరిది?” అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన రక్షిత సురేష్ చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకుంది. కర్ణాటక సంగీతం, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతో పాటు లైట్ మ్యూజిక్‌లో కూడా శిక్షణ పొందింది. తన ప్రతిభతో కన్నడలో నిర్వహించిన ‘రిథమ్ తధీమ్’, ‘లిటిల్ స్టార్ సింగర్-2009’ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత తమిళంలో జరిగిన ‘సూపర్ సింగర్ 6’ కార్యక్రమంలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి మరింత గుర్తింపు సంపాదించింది.
రక్షిత సినీ గాయనిగా తన ప్రయాణాన్ని తెలుగు పాటతోనే ప్రారంభించింది. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలోని ‘చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా’ పాట ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘లవ్ స్టోరీ’ చిత్రంలోని ‘ముత్యాల చెమ్మచెక్క’, ‘జవాన్’ సినిమాలోని ‘రామయ్యా వస్తావయ్యా’, అలాగే ‘ది లెజెండ్’ తెలుగు వెర్షన్ పాటలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రక్షిత సురేష్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన సంగీతంలో రూపొందిన పలు చిత్రాల్లో ఆమె తన గాత్రంతో మెప్పించింది.
‘లైఫ్ ఆఫ్ ముత్తు’, ‘కోబ్రా’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘పొన్నియిన్ సెల్వన్ 2’, ‘మామన్నన్’, ‘ఆడు జీవితం’, ‘థగ్ లైఫ్’ వంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయి. రెహమాన్ లైవ్ కాన్సర్ట్స్లో కూడా తరచూ కనిపిస్తూ సంగీత ప్రియులను అలరిస్తోంది. అలాగే హిప్ హాప్ తమిళ, జీవీ ప్రకాశ్ కుమార్, యువన్ శంకర్ రాజా వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కూడా ఆమె పనిచేసింది. ఇప్పుడు పెద్ది సినిమాలో ఉత్తరాంధ్ర యాసతో కూడిన ‘హల్లల్లల్లో’ పాట ద్వారా రక్షిత మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. పాటలోని ఎనర్జీ, ఆమె ప్రత్యేక గాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. జూన్ 4న సినిమా విడుదలకు ముందే పెద్ది పాటలు ట్రెండ్ అవుతుండగా, రక్షిత సురేష్ పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఇక సినిమా విడుదల తర్వాత ఈ పాట ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.