Varuna Yagam | రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10న వరుణ యాగం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు ఆగస్టు 10ను యాగానికి ముహూర్తంగా నిర్ణయించారు.
నాగార్జునసాగర్ జలాశయం తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో జరిగే ఈ యాగంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు, అర్చకులు యాగ క్రతువులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, కృష్ణా–గోదావరి నదులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. యాగంలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదాలు పొందాలని ప్రజలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఎం.ఎస్.ఎన్. రెడ్డి ప్రకటన విడుదల చేశారు.