KTR | కేసీఆర్ ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ మంచినీటి గోస తీర్చారని కేటీఆర్ తెలిపారు. ఏడాదిన్నరలోనే కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని పేర్కొన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 24 గంటలు మంచినీళ్లు ఇస్తామని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలకు కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. 24 గంటలు మంచినీళ్లు ఇచ్చేది కూడా కేసీఆరే అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీసిందని కేటీఆర్ తెలిపారు. ఇందిరాపార్క్ దగ్గర సెంట్రింగ్ కార్మికులు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. సెంట్రింగ్ వర్కర్లు, నిర్మాణ రంగ కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మళ్లీ రాబోయేది కేసీఆర్.. గులాబీ జెండానే అని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మిమ్మల్ని ఆదుకుంటామని అన్నారు. సెంట్రింగ్ కార్మికులకు బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం.. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
కూకట్‌పల్లిలోని 15 డివిజన్లలో కొత్త అధ్యక్షులను నియమిస్తామని కేటీఆర్ తెలిపారు. జూన్‌లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో కార్పొరేటర్లు నిబద్ధత కలిసిన సైనికుల్లా పనిచేశారని అన్నారు. ఎవరైతే ప్రజల చుట్టూ తిరుగుతారో.. వాళ్లకే కార్పొరేట్ టికెట్లు ఇస్తామని పునరుద్ఘాటించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. సర్వేల ఆధారంగా కార్పొరేటర్లకు టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. వచ్చే టర్మ్‌లో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు.
డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామని తెలిపారు. సభ్యత్వ నమోదు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్‌పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో 3.39 కోట్ల ఓటర్లు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో 35,985 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మన పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రతి ఓటు విలువైనదే.. నా పోలింగ్ బూత్ నా బాధ్యత అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.