Toguta : ఖరీఫ్ సీజన్లో సరిపడా యూరియా (Urea)ను సరఫరా చేయకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సహకార సంఘం చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి (Harikrishna Reddy) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం హరికృష్ణ రెడ్డి రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాను ప్రభుత్వం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
రైతులకు సకాలంలో ఎరువులను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని హరికృష్ణ రెడ్డి విమర్శించారు. మండలంలో డిమాండ్‌కు సరిపడా సప్లై చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. పంటలకు సరైన సమయంలో ఎరువులు వేయకుంటే దిగుబడి తగ్గి అన్నదాతలు నష్టపోతారని హరికృష్ణ రెడ్డి వెల్లడించారు. అధికారులు వెంటనే స్పందించి తొగుట మండలానికి అవసరమైన యూరియాను అందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. అలా జరగని పక్షంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేయడానికి వెనకాడబోమని చైర్మన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పంటలకు ఎరువులు వేయాల్సిన సమయంలో రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేసి.. యూరియా వాడొద్దని సూచించడం బాధాకరమని ఆయన అన్నారు. దుక్కి దున్నకముందే రైతు వేదికలలో సమావేశం, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తే వాళ్లు ప్రత్యామ్నాయ పంటలను వేసేవారని హరికృష్ణ రెడ్డి అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ నారాయణరెడ్డి, మండల కేంద్రంలోని రైతులు పాల్గొన్నారు.