మేడ్చల్ : ప్రభుత్వ భూములను ( Government lands) కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి (MLA Marri Rajasekhar Reddy) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరికి ( Collector Manu Chowdary) నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజిగిరి-హైదరాబాద్ జిల్లాల మధ్య ఉన్న 844 ప్రభుత్వ సర్వేనెంబర్ భూమిలో 55 ఎకరాలు కబ్జాలకు గురువుతున్నాయని, తక్షణమే వాటికి హద్దులను గుర్తించాలన్నారు. గుర్తించిన భూమిలో యూపీహెచ్‌సీలు, మల్టి ఫంక్షన్‌హాళ్లు నిర్మించేలా భూములను కేటాయించాలని కోరారు. ముస్లిం, క్రిస్టియన్ల శ్మశాన వాటికల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలన్నారు.
నియోజకవర్గంలోని 278, 171, 22, 23 ప్రభుత్వ సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములలో ఉన్న కబ్జాలను తొలగించి స్వాధీనం చేసుకోవాలన్నారు. వివిధ అభివృద్ధి పనులకు 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం నిధులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ భూములు కేటాయిస్తే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణ కమ్యూనిటీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు. పేద బ్రాహ్మణులకు అవసరాలకు వాడుకునే విధంగా భవన నిర్మాణానికి స్థలం ఏర్పాటు చేయాలన్నారు.