Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణం జరిగింది. కెరీర్‌పై ఫోకస్ చేయలని, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని చెప్పినందుకు తన కవల సోదరిని హత్య చేశాడో యువకుడు. అంతేకాదు.. కన్నతల్లిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటన ఇటీవల జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నీలిమ అనే మహిళకు హిమాన్షిక (25), హార్దిక్ (25) అనే ఇద్దరు కవల పిల్లలున్నారు.
వీరిలో హిమాన్షిక అనే యువతి గురుగ్రామ్‌లో ఇంజనీర్‌గా పని చేస్తూనే, ఎంబీయే చదువుతోంది. హార్ధిక్ కూడా ఇంజనీర్‌గా పని చేసేవాడు. కానీ, ఏడాదిన్నరక్రితం జాబ్ వదిలేశాడు. అప్పటినుంచి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా అతిగా వాడటం, అమ్మాయిలతో చాటింగ్ వంటివి చేస్తూ టైం వేస్ట్ చేసేవాడు. దీంతో హార్ధిక తల్లి నీలిమ, కవల సోదరి హిమాన్షిక తరచూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఫోన్ పక్కనబెట్టి కెరీర్‌పై ఫోకస్ చేయాలని చెప్పేవారు. అంతేకాదు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండమని సూచించేవారు. ఇదే సమయంలో హార్ధిక్‌కు పూనేకు చెందిన ఒక ముస్లిం యువతితో పరిచయమైంది. ఆమెతో అతడు ప్రేమలో ఉన్నాడు. హార్ధిక్ తల్లి, సోదరి ఇద్దరూ ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండమని చెప్తుండేసరికి హార్ధిక్ ఇద్దరిపై పగ పెంచుకున్నాడు. గత వారం కూడా ఈ అంశంపై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో హిమాన్షిక ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేసి చంపేశాడు. అంతేకాదు.. తన తల్లి పని చేసే ఆఫీసుకు వెళ్లి తల్లిని కలిశాడు.
ఇంటిదగ్గర ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాడు. తర్వాత తల్లి ఇంటికెళ్లేసరికి కూతురు హిమాన్షిక రక్తపు మడుగులో చనిపోయి ఉంది. ఇది చూసి తల్లి నీలిమ షాకైంది. ఇదే సమయంలో హార్ధిక్.. తన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమెకు కూడా తీవ్రగాయాలయ్యాయి. అనంతరం అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం నీలిమ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు తీవ్ర గాయాలైనప్పటికీ, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు హిమాన్షిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతదేహంపై ఉన్న గాయాలు చూసి వైద్యులు షాకయ్యారు. హిమాన్షికను హార్ధిక్ 84 సార్లు పొడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హార్ధిక్‌ను 24 గంటల్లోనే అరెస్టు చేశారు.