Hyderabad | హైదరాబాద్‌లో డ్రగ్ పెడ్లర్ బీభత్సం సృష్టించాడు. డ్రగ్స్ మత్తులో ఏకంగా పోలీసులపైకే కారు ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ అవ్వగా.. మరో కానిస్టేబుల్, సీఐకి గాయాలయ్యాయి. దీంతో సదరు వ్యక్తిపై పోలీసులుమర్డర్ కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మధ్యాహ్నం అబిడ్స్‌లోని డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమరంలో ఆదివారం మధ్యాహ్నం ఓ కారు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ వద్దకు రాగానే ఓ వ్యక్తి అతనికి ఒక ప్యాకెట్ అందజేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ప్యాకెట్ అందజేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఉన్న హుస్సేని ఆలంకు చెందిన సైఫ్‌ను అడ్డుకుని కారులో నుంచి దిగాలని సూచించారు.
అయితే కారు పక్కకు తీస్తున్నట్లుగా చేసిన సైఫ్ ఒక్కసారిగా కారును రివర్స్ చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ కాలుపై నుంచి కారును పోనిచ్చాడు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ అతన్ని వెంబడించి అఫ్జల్‌గంజ్ దగ్గర అడ్డుకున్నారు. చివరకు అఫ్జల్‌గంజ్ వద్ద సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, కారు కాలుపై నుంచి వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు ఫ్రాక్చర్ అయ్యింది. అతన్ని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేజింగ్‌లో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మరో కానిస్టేబుల్ వంశీధర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.