పట్టుదల, ఆసక్తి, లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరక్షరాస్యులైన ఆదివాసీ మహిళలు నిరూపిస్తున్నారు. నిత్యం కూలీ, వ్యవసాయ పనుల్లో లీనమయ్యేవాళ్లంతా సాధికారత దిశగా అడుగులు వేశారు. స్వయం ప్రతిపత్తి సాధించాలని డిటర్జెంట్ సబ్బుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివ్వాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు. తాము నమ్ముకున్న దైవాల పేరిట ‘సమ్మక్క సారలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్’ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదుగుతున్న ఆదివాస్త్రీల గెలుపు కథ ఇది.
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వాళ్లవి. కూలీనాలీ చేసుకుంటూ బతుకు వెళ్లదీశారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు అందరిలో మిన్నగా నిలబడ్డారు. శివ్వాపూర్ గ్రామానికి చెందిన ధనసరి సౌజన్య, పూనెం రమ, పూనెం సీతమ్మ, కోసం సమ్మక్క, చింత జ్యోతి, సిద్దబోయిన శరత్, ధనసరి నర్సయ్యకు 2019లో రూ.23 లక్షలతో ఎంఎస్ఎంఈ స్కీం కింద డిటర్జెంట్ సబ్బుల తయారీ యూనిట్ మంజూరైంది. గ్రామంలోనే సబ్బుల కేంద్రాన్ని నెలకొల్పారు. వాళ్లు తయారు చేసిన సబ్బులను ఐటీడీఏ సహకారంతో గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఈ సబ్బులను ఉట్నూరు, భద్రాచలం, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులకు సరఫరా చేసేవాళ్లు. అలా ఆదాయం సమకూరడంతో.. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు ఈ మహిళలు. రాబడి పెరగడంతో పిల్లలను చక్కగా చదివిస్తున్నారు. పొదుపు మంత్రం పఠిస్తూ జీవితంలో పైకి ఎదుగుతున్నారు.

సబ్బుల తయారీకి మొదట్లో వరంగల్ నుంచి 15 రకాల ముడిసరుకులు కొనుగోలు చేసేవారు. ధరలు ఎక్కువగా ఉండటంతో వీరికి గిట్టుబాటు అయ్యేది కాదు. ఇలా లాభం లేదనుకొని హైదరాబాద్, రాయపూర్, ఇండోర్, డోన్ నగరాల నుంచి తక్కువ ధరకు ముడిసరుకులు దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు. సమష్టిగా పనిచేస్తూ ఉత్పత్తి చేసిన సబ్బులను ‘గిరి’ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు. ‘యూనిట్ నెలకొల్పిన తర్వాత ఎన్నో కష్టనష్టాలు ఎదురయ్యాయి. అయినా నిరాశకు గురి కాకుండా మార్కెట్ గురించి తెలుసుకున్నాం. అధికారులను సంప్రదించాం. వేర్వేరు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు ముడిసరుకులు కొనుగోలు చేయడంతో పెట్టుబడి వ్యయం తగ్గింది. అంతేకాకుండా, ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ సబ్బులను ఇతర జిల్లాలకు పంపించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.38 లక్షల సబ్బులను తయారు చేసి రూ.3.45 కోట్ల వ్యాపారం చేశాం. ప్రస్తుతం నెలకు ఒక్కొక్కరికీ రూ.20 వేల వరకు ఆదాయం సమకూరుతున్నది’ అని చెబుతున్నది గ్రూప్ అధ్యక్షురాలు ధనసరి సౌజన్య.
‘అసలు సబ్బుల తయారీ మా వల్ల అవుతుందా అని తొలుత అనుమానించాం. హైదరాబాద్లోని జీడిమెట్లలో శిక్షణ తీసుకున్నాం. అందరం ఒక్కతాటిపై ఉంటే.. గెలుస్తాం అనుకొని రంగంలోకి దిగాం. ప్రతిరోజూ పదివేల వరకు సబ్బులు తయారు చేయగలుగుతున్నాం. ఇప్పుడు కూలి పనులకు స్వస్తి పలికాం. ప్రభుత్వం సహకరిస్తే పెద్ద యూనిట్ నెలకొల్పాలన్న నిశ్చయంతో ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది గ్రూప్ సెక్రటరీ పూనెం రమ. అంచెలంచెలుగా ఎదిగిన ఈ అతివలు వ్యాపారంలో మరింతగా ఎదగాలని మనమూ కోరుకుందాం!