Ramagundam Corporation | కోల్ సిటీ, జూలై 26 : రామగుండం బల్దియాలో అక్రమాలను అరికట్టడంతోపాటు అవినీతి అధికారులు, కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. ఈ మేరకు స్థానిక భాస్కర్ రావు భవన్లో ఆదివారం సీపీఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్కపురి సూర్య మాట్లాడుతూ.. రామగుండం కార్పొరేషన్ లోని కీలక శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మాస్టర్ ప్లాన్ ప్రకటించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని కూల్చివేతలు జరపాలని సూచించారు.
ఇటీవల నగరంలోని పలు డివిజన్లలో సుమారు రూ.13 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారని.. వీటిలో కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడకుండా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలోఖాళీగా ఉన్న144 పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం విచారకరమన్నారు. రామగుండంకు బదిలీపై రావడానికే అధికారులు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఆరుగురు శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు కేవలం ఇద్దరే ఉండటం శోచనీయమన్నారు.
టౌన్ ప్లానింగ్‌లో అవినీతిని పారద్రోలాలని కోరారు. విజిలెన్స్ విచారణను సన్నగిల్లించే ప్రయత్నం జరుగుతుందన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోసిక మోహన్, నగర కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదెమ్మ, ఆసాల రమ, శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, రాణవేణి సుధీర్, ఆశాల నవీన్, సాదుల శివ, అబ్ధుల్ కరీం, తిరుమల, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.