Ukraine : నలుగురు భారతీయులతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఉక్రెయిన్‌లోని ఒడెశా పోర్టు వద్ద దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది సురక్షితంగా ఉండగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కీవ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. శనివారం ఈ దాడి జరిగినట్లు వెల్లడించింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని రాయబార కార్యాలయం ఆదివారం వివరించింది.
ఎంవీ ఏజీఎన్ రంగార్ అనే వాణిజ్య నౌక నల్లసముద్రంలోని ఒడెశా పోర్టులో నిలిచి ఉంచిన సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ పోర్టు వాణిజ్య రవాణాకు చాలా కీలకం. రష్యా-ఉక్రెయిన్ వార్ సందర్భంగా ఈ నౌకపై, ఈ పోర్టుపై గతంలో కూడా దాడి యత్నం జరిగినట్లు తెలుస్తోంది. దాడి నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. దాడి సమయంలో ఇద్దరు భారతీయులు నౌకలో ఉండగా, ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ దాడి ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనే వివరాల్ని మాత్రం భారత అధికారులు వెల్లడించలేదు. ఉక్రెయిన్ వాణిజ్యానికి నల్ల సముద్రంలోని ఒడెశా పోర్టు చాలా కీలకం.
ఈ దేశానికి అత్యంత కీలకం కాబట్టి, 2022 ఫిబ్రవరిలో రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అనేకాసర్లు ఈ పోర్టుపై దాడి జరిగింది. మరోవైపు నల్ల సముద్రంలో ఉద్రిక్తతలు పెరగడంపై ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ కీలక ప్రకటన చేశారు. నల్ల సముద్రంలో ప్రయాణించే నౌకలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో పని చేసే భారతీయ నౌకాయాన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేసుకోవాలని కేంద్రం సూచించింది.