Telangana | గురుకులాల విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందక దవాఖానల పాలవుతున్నారు. కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురవుతున్నారు. గత రెండేండ్లలోనే ఏకంగా 126 మంది గురుకులాల విద్యార్థులు మృతిచెందడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. మృతుల్లో బాలికలు 54 మంది, బాలురు 72 మంది. ఈ పరిస్థితికి సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, పర్యవేక్షణ లోపాలే కారణమని విద్యావేత్తలు, గురుకుల సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలు పోతుంటే, సర్కార్ మాత్రం పేరుకు ఎంక్వయిరీ కమిటీ వేయడం, కంటితుడుపుగా అక్కడి వార్డెన్, లేదంటే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. అంతేతప్ప అసలు వాటికి కారణాలేమిటి? ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి? ఎవరు కారకులు? పరిష్కారం ఏమిటి? అన్న అంశాలపై ప్రభుత్వమూ, ఉన్నతాధికారులు దృష్టి సారించడంలేదు.
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పనివేళల ఫలితంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, గురుకుల సొసైటీల్లోని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ప్రభుత్వం గత సంవత్సరం గురుకులాల పనివేళలు మార్చడంతో విద్యార్థుల మీద ఒత్తిడి పెరిగిందని వివరిస్తున్నారు. గురుకుల విద్యార్థుల దినచర్య ఉదయం 5 గంటలతో మొదలై, 7 గంటల వరకు బ్రేక్‌ఫాస్ట్ ముగించి, ఆ తర్వాత 8.15 గంటల నుంచి మధ్యాహ్నం 1:25 వరకు 7 పీరియడ్లను ఏకధాటిగా నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గురుకుల విద్యార్థులను రోబోల్లా ట్రీట్ చేస్తున్నారని, మొత్తంగా 16 గంటల షెడ్యూల్లో విద్యార్థులకు కనీసం 2.30 గంటలపాటు పర్సనల్ టైమ్ కూడా లేదని, అందులోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ పూర్తి చేయాల్సి వస్తున్నదని చెప్తున్నారు. ఇది విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తరగతి గదిలో తల కూడా తిప్పుకునే అవకాశం లేకుండా వరుసగా మూడు గంటలపాటు కూర్చుని పాఠాలు వినాల్సి వస్తున్నదని, విద్యార్థులు ఏకాగ్రతను కోల్పోతున్నారని, ఒత్తిడిని అనుభవిస్తున్నారని వివరిస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడే ఆత్మహత్యలకు దారితీస్తున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మారిన పనివేళలతో ఉపాధ్యాయులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకుల ఉపాధ్యాయుడికి పాఠాలు చెప్పడం ఒక్కటే కాకుండా డైనింగ్, వాటర్ డ్యూటీ, శానిటరీ డ్యూటీ, కిచెన్ ఇన్స్పెక్షన్, ఏటీపీ రొటేషన్, స్టడీ అవర్స్, కూరగాయలను కొలతలతో ఇవ్వడం, రాయడం ఇత్యాది అనేక బోధనేతర విధులు అప్పగిస్తున్నారు. దీంతో వృత్తికి, తాము చేసే పనికి సంబంధమే లేదనే నైరాశ్యంలో కూరుకుపోతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. గురుకులాల్లో గడచిన రెండేండ్లుగా నిత్యం ఎక్కడో ఒకచోట ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గురుకులాల్లో ఆహార పదార్థాలు, కిరాణ సామగ్రి, పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల కోసం గతంలో ఎప్పుడూ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసేవారు. మార్చి, ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో విద్యా సంవత్సరం ఆరంభం నాటికి కొత్త కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండేవారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త టెండర్లు ఆహ్వానించలేదు.
2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఇప్పటికీ పూర్తి చేయలేదు. సుదీర్ఘ జాప్యం తరువాత సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో నిత్యావసర సరకుల ప్రొక్యూర్మెంట్, ఇతర సరకుల సేకరణపై మార్గదర్శకాల రూపకల్పన కోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎస్‌యూ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2026 జూలైలో ఆదేశాలు జారీ చేసింది. ఆ కమిటీ గత ఆగస్టులో మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా సరుకుల ధరలను సవరించింది. అయితే 20% చోట్ల మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి. తమనే కొనసాగించాలని పలువురు పాత గుత్తేదారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం పాత రేట్లతోనే, పాత గుత్తేదారులతోనే ఎక్కడికక్కడ గురుకులాలను నిర్వహిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలను సవరించకపోవడంతో గుత్తేదారులు థర్డ్‌గ్రేడ్ సరుకులను సరఫరా చేస్తున్న దుస్థితి నెలకొన్నది.
గుత్తేదారులతో పలువురు ప్రిన్సిపాల్స్ కుమ్మక్కు అవుతుండటంతోపాటు నాణ్యతకు పూర్తిగా తిలోదకాలిచ్చారు. ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. నూతన టెండర్ ప్రక్రియను పూర్తి చేయకముందే గుత్తేదారులకు గతంలోని సెక్యూరిటీ డిపాజిట్లను ఎక్కడికక్కడ చెల్లింపులు చేశారు. బిల్లులను కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించపోవడమూ గుత్తేదారుల ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కారణమని తెలుస్తున్నది. అరకొరగా, నాణ్యతలేని సరుకులనే గురుకులాలకు సరఫరా చేస్తున్నారని క్షేత్రస్థాయి ప్రిన్సిపాల్స్ వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో వరుసగా ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని సొసైటీ వర్గాలు, విద్యార్థి సంఘాలు తేల్చిచెప్తున్నాయి.
విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సంబంధించిన మెస్‌చార్జీలను పెంచుతూ గత ఆగస్టులో ఉత్తర్వులు జారీచేసింది. కామన్ డైట్‌ను కూడాప్రకటించింది. కానీ, అది ఆచరణలోకి రాలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడమే అందుకు కారణమని సొసైటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో గురుకులాల్లో మెనూ అమలు కోసం టీఎస్ మెనూ అప్లికేషన్ అమలు చేసేశారు. విద్యార్థుల హాజరును నమోదు చేసి డైట్‌ను అమలు చేసేవారు. ప్రస్తుతం దాని స్థానంలో టీజీ డైట్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చారు.. విద్యార్థుల సంఖ్యను ఎంట్రీ చేయగానే, మెనూ ప్రకారం ఏ ప్రమాణాల ప్రకారం ఏయే సరుకులు వాడాలి? ఎంత క్వాంటిటీ కావాలి? తదితర వివరాలన్నీ ఆటోమేటిక్‌గా అప్లికేషన్ అందిస్తుంది. అందుకు అనుగుణంగా సంబంధిత గురుకుల ప్రిన్సిపాల్స్ మెనూ అమలు చేయాలి. అయితే టీజీ డైట్ అప్లికేషన్‌ను ఇప్పటికీ 50% గురుకులాలు కూడా అమలు చేయడం లేదు. నూతన టెండర్ ప్రక్రియ పూర్తికాకపోవడమే అందుకు కారణమని ప్రిన్సిపాల్స్ చెప్తున్నారు.
ప్రతి గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తంగా సాంక్షన్ విద్యార్థుల సంఖ్య 640. పూర్తిస్థాయిలో సామర్థ్యం మేరకు విద్యార్థులు ఉన్నచోట క్యాటరింగ్ నిర్వహణకు (వంట నిర్వహణ) ఒక్కో గురుకులంలో ఎనిమిది మందిని నియమించాలి. లేదంటే 80 మందికి ఒక మనిషి చొప్పున నియమించాలి. క్యాటరింగ్ సంస్థలను ఏటా టెండర్ ద్వారానే ఖరారు చేస్తారు. కానీ ఇప్పటికీ టెండర్లు ఖరారు కాలేదు. కొత్త రేట్లు, క్యాటరింగ్ నిర్వాహకులు అందుబాటులోకి రాలేదు. గతంలో క్యాటరింగ్ సేవలు నిర్వహించిన గుత్తేదారులకు ప్రభుత్వం బిల్లులను సక్రమంగా విడుదల చేయడం లేదు. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు నిర్ణీత సంఖ్యలో మనుషులను నియమించకుండా అరకొరగానే నియమించి కాలం వెల్లదీస్తున్నారు. దీంతో గురుకుల సిబ్బందిపై పనిఒత్తిడి పెరుగుతున్నది.
వంటపాత్రలను శుభ్రంగా కడగకుండా, పరిశుభ్రత పాటించకుండా ఇష్టారీతిన వంట నిర్వహణను మమా అనిపిస్తున్నారు. అంతిమంగా అది ఫుడ్‌పాయిజన్ ఘటనలకు దారితీస్తున్నది. ప్రతి గురుకులంలో పారిశుధ్య పనుల నిర్వహణకు స్వీపింగ్ సేవలను అందించే సంస్థలను కూడా టెండర్ ద్వారా ఖరారు చేస్తారు. స్వీపింగ్ సంస్థ ప్రతి గురుకులంలో నలుగురు పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాలి. స్వీపింగ్ సేవలకుగాను నెలకు రూ.40వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. స్వీపింగ్ సిబ్బంది వాటర్ ట్యాంకులతోపాటు గురుకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తదితర పనులను నిర్వర్తిస్తారు. ఈ ఏడాది ఇప్పటికీ స్వీపింగ్ సిబ్బందిని నియమించలేదు. దీంతో గురుకులాల్లో ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయని దుస్థితి నెలకొన్నది. వెరసి నీరు కలుషితమై ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదయ్యేందుకు కారణమవుతున్నది.

భిక్కనూరు, మార్చి 6: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో విద్యార్థులు అన్నం పడేసి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని కొన్ని రోజులుగా చెప్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎంఈవోకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
విషాద ఘటనల వివరాలు
అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు