– ప్రజా సంఘాల నాయకుల పిలుపు
జూలూరుపాడు, ఆగస్టు 05 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా రమేశ్ పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మండల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాసా నరేష్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ… నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజా సంపదను దోచుకుంటూ, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. వెంటనే పత్తి, మొక్కజొన్న, పాడి ఉత్పత్తులు దిగుమతి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కొత్తగా తెచ్చిన విబి జి రామ్ జీ విధానాలను, నూతన విత్తన చట్టం, విద్యుత్ సవరణ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త ‘జైల్ భరో’ ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, నిరసనకారులతో పోలీస్ స్టేషన్లు, జైళ్లు నిండాలని కోరారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు పద్దం సుగుణ, రాచబంటి కోటేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, సిఐటియు మండల కన్వీనర్ బోడ అభిమిత్ర, రైతు సంఘం మండల నాయకులు మాలోత్ రాములు, బానోత్ ఈశ్వర్, ధరావత్ రమేష్, గార్లపాటి వెంకటి, ఇల్లంగి సీతారాములు, బానోత్ రూపా పాల్గొన్నారు.