భువనేశ్వర్: ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. తోటలో మృతదేహాలు పాతిపెట్టాడు. (Man Murders Wife, Mother In Law) ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. భార్య, అత్త అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తోటలో కొత్తగా వెలసిన అరటి చెట్లపై అనుమానం రావడంతో అతడు అరెస్ట్ అయ్యాడు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేబాషిష్ పాత్ర, 23 ఏళ్ల సోనాలి దలాల్ భార్యాభర్తలు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. భర్తతో గొడవ పడిన సోనాలి కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
కాగా, జూలై 12 సోనాలి తల్లి సుమతి తన కుమార్తె, మనవడ్ని భర్త ఇంటికి తీసుకొచ్చింది. కూతురు కాపురం నిలబెట్టేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే జూలై 19న ఆ ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో నిద్రిస్తున్న భార్య సోనాలి, ఆమె తల్లి, అత్తైన సుమతి తలలపై బండరాళ్లతో మోది దేబాషిష్ హత్య చేశాడు. వర్షం పడుతున్న ఆ రాత్రి వేళ నిమ్మకాయల తోటలో గొయ్యి తీసి మృతదేహాలను పాతిపెట్టారు. అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు.
మరోవైపు ఆ మరునాడు దేబాషిష్ పాత్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. భార్య సోనాలి, అత్త సుమతి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కుమారుడ్ని తనకు అప్పగించిన తర్వాత వారిద్దరూ ఆ ఊరి నుంచి వెళ్లినట్లు పోలీసులకు, అత్త కుటుంబం వారికి చెప్పాడు. ఆ తర్వాత ఎలాంటి ఆందోళన లేకుండా తన కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు.
కాగా, దేబాషిష్ తోటలో కొత్తగా అరటి చెట్లు పెరుతుండటాన్ని స్థానికులు గమనించారు. అక్కడ తవ్వినట్లుగా ఉండటంతో అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు దేబాషిష్ను ప్రశ్నించారు. దీంతో అతడు నిజం ఒప్పుకున్నాడు. భార్య, అత్తను హత్య చేసి అక్కడ పాతినట్లు తెలిపాడు.
అయితే అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడ అరటి చెట్లు నాటినట్లు దేబాషిష్ చెప్పాడు. దీంతో అక్కడ తవ్వి కుళ్లిన మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Father Kills Son | పదేళ్ల కొడుకును చంపిన తండ్రి.. భార్యకు సమాచారం ఇచ్చి పరార్
Watch: రూ.70,000కుపైగా జీతాలు.. 11,18,19ను ఇంగ్లీష్‌లో రాయడంలో ప్రభుత్వ టీచర్లు విఫలం
Watch: విధుల్లో చేరిన తొలిరోజే, గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఎందుకంటే?