శంకరపట్నం, మార్చి 6 : భారీ వర్షాలకు సీఎంఆర్ కింద తీసుకు న్న ధాన్యం తడిసి వ్యాపారంలో భర్తకు నష్టాలు రావడం.. అప్పులు చెల్లించకపోతే అధికారులు కేసులు పెడతారని భయపడి తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైస్ మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగట్టుకు చెందిన రైస్ మిల్లు వ్యాపారి తణుకు సురేశ్‌కు ఇటీవల రైస్మిల్లుతోపాటు, ఇతర వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి.
2021-22లో సీఎంఆర్ కింద తీసుకున్న ధాన్యం అప్పట్లో భారీ వర్షాలకు తడిసింది. దీంతో భారీగా నష్టపోవడంతో సకాలంలో ప్రభుత్వానికి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పౌరసరఫరాల సంస్థ నుంచి నోటీసులు వచ్చాయి. జరిమానాలు విధించారు. ఈ క్రమంలో అప్పులతోపాటు వడ్డీలు పెరిగాయి. ఈ క్రమంలో సురేశ్ భార్య తణుకు స్వప్న (42) మనోవేదనకు గురై శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
స్వప్న ఆత్మహత్యపై తెలంగాణ రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డితోపాటు రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ నాయకులు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. స్వప్న భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాడి గణపతిరెడ్డి మాట్లాడుతూ.. రైస్‌మిల్లర్ల నష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇప్పటికే విధించిన 25 శాతం జరిమానాతోపాటు 12 శాతం వడ్డీ విధించడం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైస్ మిల్లర్లకు ఎంతో నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రైస్ మిల్లు ఇండస్ట్రీలోనే మొదటిసారి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి, కమిషనర్.. రైస్ మిల్లర్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.