హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. ఇండ్ల కేటాయింపులో ప్రజల నుంచి ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, సీబీఐలకు ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయంపులో అవకతవకలు జరిగాయని, సీబీఐతో విచారణ జరిపించాలని వెంకటాపురానికి చెందిన వితంతువు తిప్పల సాయిభవాని హైకోర్టుకు లేఖ రాశారు. ఇల్లు కేటాయించాలన్న తన అభ్యర్థనను పరిశీలించలేదని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల ను కేటాయించడానికి రూ.50 వేల నుం చి రూ.లక్ష వరకు అధికారులు వసూలు చేశారని ఆరోపించారు. ఇదే సొమ్ముతో అధికారులు వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పేరొన్నారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. దీనిపై జస్టిస్ పీ శ్యాం కోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది.