ఎదులాపురం, ఆగస్టు 5 : కనకదుర్గ చిట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి ఏళ్ల తరబడి తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 93 మంది బాధితులకు పోలీసుల చొరవతో న్యాయం జరిగింది. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో బుధవారం రూ.2.34 కోట్ల చెకులను బాధితులకు అందజేశారు. కనకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యం బాధితులకు చెల్లించాల్సిన సొమ్మును తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. దర్యాప్తు సందర్భంగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉందని నిందితుడికి తెలియజేయడంతో, బాధితులందరికీ బకాయి మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేందుకు అతను అంగీకరించాడు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో 93 మంది బాధితులకు రావాల్సిన మొత్తం రూ.2.34 కోట్లకు పైగా విలువైన చెకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.నాగరాజు, కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.