Fine Rice | హత్నూర, ఏప్రిల్ 02 : అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యాన్ని రాష్ట్రప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి గునుకుంట్ల కమలాకర్ విమర్శించారు. ఈ విషయమై ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు ఉచితంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా కరోనా కష్టకాలం నుంచి 5 కిలోల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా.. అదనంగా ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ.. ఒకరికి ఆరు కిలోల చొప్పున ఇస్తూ మొత్తం తామే ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలకుపోతూ మంత్రులచేత నిరాడంబరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నట్టుగా ప్రజల్ని నమ్మించి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కాగా ఈ పథకాన్ని కేంద్రం 2028 వరకు కొనసాగించనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం హర్షించదగ్గ విషయం అన్నారు. నేడు రాష్ట్రంలో గత నెల పెన్షన్లు వేయకపోవడంతో ఏంతో మంది అబాగ్యులు పెన్షన్ డబ్బులకోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతోపాటు పెన్షన్లు నెలనెలా సక్రమంగా అందజేయాలని తెలిపారు.