Expiry Date | శివంపేట, ఏప్రిల్ 15 : శివంపేట మండలంలోని చండి గ్రామానికి చెందిన డైరీ ఫామ్ రైతు నర్సింగ్ ఆంజనేయులు ఎదుర్కొన్న సంఘటన పశుసంవర్ధక శాఖ పని తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తన ఫామ్‌లో ఉన్న గేదెలకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో రైతు నర్సింగ్ ఆంజనేయులు అత్యవసర సేవల కోసం 1962 పశువైద్య సేవా నంబర్‌కు కాల్ చేశారు. అందుకు స్పందించిన వైద్య సిబ్బంది ఫామ్‌కు చేరుకొని గేదె పరిస్థితిని పరిశీలించి వెంటనే సెలైన్ బాటిల్ ఎక్కించాలని సూచించారు. దీంతో రైతు మండల కేంద్రమైన శివంపేట పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వెళ్లి సెలైన్ బాటిల్ ఇవ్వాలని కోరాడు.
కార్యాలయంలో ఉన్న వెటర్నరీ సిబ్బంది రెండు సెలైన్ బాటిళ్లు ఇచ్చారు. అవి తీసుకొని ఫామ్‌కు వెళ్లిన రైతు వాటిని వైద్యులకు అందించగా, సెలైన్ బాటిళ్లపై ఉన్న ఎక్స్పైరీ తేదీని పరిశీలించిన డాక్టర్లు అవి ఇప్పటికే ఐదు నెలల క్రితమే గడువు ముగిసినవని గుర్తించారు. ఈ విషయం తెలిసి రైతు నర్సింగ్ ఆంజనేయులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యాడు. తక్షణమే ఆ సెలైన్ బాటిళ్లను తీసుకొని తిరిగి పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి చేరుకున్న రైతు, వెటర్నరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఎవరు బాధ్యత వహిస్తారు..?
5 నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం..? ఆ సెలైన్ గేదెకు ఎక్కించి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు..? అంటూ అధికారులను ప్రశ్నించాడు. పశువుల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన మందులు సరైన విధంగా నిల్వ ఉంచకపోవడం, గడువు ముగిసిన మందులు కార్యాలయంలో ఉండటం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని రైతు మండిపడ్డాడు.
ఈ ఘటనపై పై అధికారులు వెంటనే స్పందించి, పశువులకు నాణ్యమైన మందులు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. పశుసంవర్ధక శాఖ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని స్థానిక రైతులు కూడా కోరుతున్నారు.

Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
Ashok Mittal | ఫెమా ఉల్లంఘన ఆరోపణలు.. ఆప్ ఎంపీ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు