SFI | నర్సాపూర్, నవంబర్ 17 : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని సంగారెడ్డి మార్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీ వాత్సల్ గురుకుల విద్యాలయాన్ని (ప్రైవేట్) నడిపిస్తున్నారని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ ఆరోపించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా పాఠశాలను నడపరాదని విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తే గత రెండు నెలల నుండి అనుమతి పత్రాలను చూపించడం లేదని, కనీసం స్కూల్ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. యూడైస్ కోడ్ ఉందని, అనుమతి ఉందని చెబుతూ మభ్యపెడుతూ వస్తున్నారని తెలిపారు.
మెయిన్ బ్రాంచ్ గండిమైసమ్మ పేరుతో యూడైస్ కోడ్‌ను తీసుకువచ్చి నర్సాపూర్‌లో పాఠశాలను నిర్వహిస్తుంటే మండల విద్యాధికారి డబ్బులు తీసుకొని అన్ని అనుమతులు ఉన్నాయని విద్యార్ధి సంఘాలని భయపెడుతూ, మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టేట్ సిలబస్ అలాగే సీబీఎస్ఈ గానీ ఎలాంటి గుర్తింపు లేకుండా శ్రీ వాత్సల్ స్కూల్‌ను నడిపిస్తున్నారని వెల్లడించారు. సీబీఎస్ఈ పేరుతో ఒక్కో విద్యార్ధి నుండి దాదాపు రూ.70 వేలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకున్నా పాఠశాలను ఎంఈవో తారాసింగ్ వెనుకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. సీబీఎస్ఈ పేరుతో విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తుంటే ఎంఈవో, డీఈవో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
లేకుంటే ఎంఈవో కార్యాలయం ముట్టడి..
గత రెండు నెలల క్రితం వర్షం పడ్డప్పుడు స్కూల్ ఆవరణంలో నీళ్లు నిండిపోయి విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని గుర్తుచేశారు. మండల విద్యాధికారి ఎందుకు స్పందించడం లేదో అర్ధం కావడం లేదని వెల్లడించారు. తక్షణమే ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న శ్రీ వాత్సల్ గురుకుల పాఠశాలను మూసివేయాలని, లేకుంటే ఎంఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఎ మెదక్ జిల్లా కమిటీ తరుపున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంధ్య పాల్గొన్నారు.


Sarangapur | పంటల అవశేషాలను కాల్చడంతో సేంద్రీయ పోషకాలు నశిస్తాయి.. సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి
Farmers Protest | పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!