Gopichand Malineni | నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనిల హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. బ్లాక్బస్టర్ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఘన విజయం తర్వాత ఈ ఇద్దరూ కలిసి రెండో చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్బీకే111 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే టైం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలతో అధికారికంగా ఈ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇది చరిత్ర, వర్తమానం మేళవింపుగా సాగే ఒక శక్తిమంతమైన యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక పాత్రలో రాజుగా అలరించనున్నారని సమాచారం. ఈ పాత్ర బాలయ్య అభిమానులకు పెద్ద విందు కానుంది. ఈ చిత్రంలో కథానాయికగా స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతుండగా.. త్వరలోనే చిత్ర బృందం దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. గతంలో వీరిద్దరూ ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.