ఇన్నాళ్లూ.. ఆర్థిక మాంద్యం అనే పేరు విన్నాం కానీ, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్నేహమాంద్యం ఏర్పడుతుందని అంటున్నాయి అనేక సర్వేలు. అందులోనూ.. నగరాల్లో పరిస్థితి ఘోరంగా మారుతుందట. అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 43 శాతం మంది ఒంటరి తనంతో గుడుపుతున్నారట!. బిజీ లైఫ్, స్మార్టు ఫోన్లకు అడిక్ట్ కావడం, ఆన్లైన్ చాటింగ్లకు అలవాటు పడడం, మనసువిప్పి మాట్లాడకపోవడం, మంచీచెడ్డలు పంచుకోకపోవడం, ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గిపోతుండడం వంటి అనేక కారణాలు.. ఇందుకు దోహద పడుతున్నాయని సర్వేలు తేల్చిచెప్పాయి. ఈ ప్రభావం.. రోజురోజుకూ పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ‘స్నేహమాంద్యం’ అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మానసిక రుగ్మతలు పెరగడమే కాకుండా.. ప్రధానంగా డిప్రెషన్‌కు గురయ్యే వారి సంఖ్య మున్ముందు పెరిగే ప్రమాదాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇప్పటికైనా ప్రతి ఇంట్లోని ప్రజలు మేల్కోనాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.
– కరీంనగర్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రపంచవ్యాప్తంగా స్నేహ సంబంధాలు తగ్గుతున్నాయా? సమయం దొరికితే చాలు.. స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయి.. దానితోనే గడుపుతున్నారా? ఇంట్లో వారితో పాటు.. తోటి మిత్రులతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నారా? సమస్య వచ్చినప్పుడు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక వేదనకు గురవుతున్నారా? తద్వారా ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారా? అంటే.. అవునంటున్నాయి అనేక సర్వే సంస్థలు. నిజానికి గతేడాదే అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఈ విషయంపై అధ్యయనం చేసి వివరాలు వెల్లడించింది. అలాగే, అమెరికన్ పెర్సెక్టిప్స్ సంస్థ కూడా సర్వేలు చేసి విషయాలు వెల్లడించింది. ఇవేకాదు.. ఇప్పుడు పలు విశ్వవిద్యాలయాలు కూడా ఈ విషయంలో సర్వే చేస్తున్నాయి. అలాగే, ముందుగా ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు.
కానీ, రోజురోజుకూ డిప్రెషన్ బాధితులు పెరుగుతుండడంతో ప్రస్తుతం ‘స్నేహమాంద్యం’ అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాల్లోనూ వైరల్ అవుతోంది. పలు సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1960 ప్రాంతంలో ఒక్కొక్కరికి 100 మంది స్నేహితులు ఉండగా 1990 నాటికి ఆ సంఖ్య ఐదుగురికి చేరింది. ఇప్పుడు ఒక్కరు ఉండడం కూడా గగనమైంది. మన దేశంలో 12 నుంచి 15 శాతం జనాభాకు అసలు స్నేహితులే లేరని పలు సర్వేలు వెల్లడిస్తుండగా.. ప్రధానంగా పట్టణ, నగర ప్రాంతాల్లో 43 శాతం మంది ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్లుగా ‘ఇప్సోస్’ అనే సంస్థ తన సర్వేలో తేల్చింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో 60 శాతం వరకు ఒంటరితనంగానే ఉంటున్నారని రెడ్ల్యాబ్, యూగో లాంటి సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. నేటి యువతీయువకుల్లో ఇది మరింత ఎక్కువ అవుతుందని పేర్కొంటున్నాయి.
స్నేహంతో లాభాలు
స్నేహం అనేది ఒక పెట్టుబడిలాంటిదని అంటున్నారు నిపుణులు. దీనివల్ల భవిష్యత్తులో లాభాలే తప్ప నష్టాలు ఉండవని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ పరిశోధకుడు జెఫ్రీ హాల్ ఇప్పటికే తేల్చిచెప్పారు. స్నేహితులతో ఉండడం, వారితో మనసులోని మాటలు చెప్పుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. స్నేహితులతో ఉండేవారు ఆహ్లాదంగా ఉంటారని, దీనివల్ల మానసికోల్లాసం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, స్నేహితులు లేకపోవడం వల్ల చాలా మంది ఒంటరితనానికి లోనవుతున్నారని, తద్వారా డిప్రెషన్‌కు గురవుతున్నారని, వారికి ఏదైనా బాధొచ్చినా, కష్టమొచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. వారికి వారే మానసికంగా కుంగిపోయి.. ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు వైద్యులు. ఈ పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషించాలంటున్నారు నిపుణులు. పిల్లలతో గడుపడం లేదా, పిల్లలను వారి స్నేహితులను కలిపి కొంత వారికి ఆటవిడుపు కల్పించడం, స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ కాకుండా చూడడం వంటివి చేయడం వల్ల పిల్లలకు సోషల్ మూమెంట్ పెరుగుతుందని, అదే విధానం పెద్ద పెరిగిన తదుపరి కూడా కంటిన్యూ అవ్వడం వల్ల స్నేహితులు సంఖ్య పెరుగుతుందని, ఫలితంగా.. అతను ఉల్లాసంగా ఉండడమేకాకుండా, మానసిక రుగ్మతలకు గురికాకుండా ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు.
సమయం లేదు మిత్రమా?
ఒకప్పుడు.. ఇంటికి వచ్చారంటే అమ్మానాన్నలతో ముచ్చట్లు.. లేదా అన్నాదమ్ములతో కబుర్లు.. స్కూల్, కళాశాలలు, ఉద్యోగ సంస్థలు ఇలా ఎక్కడికి వెళ్లినా.. ఐదు నిముషాల సమయం దొరికితే చాలు.. సరదాగా నాలుగు మాటలు మనసు విప్పి మాట్లాడుకునే వారు. గత స్మృతులను నెమరు వేసుకునే వారు. తోటి ఫ్రెండ్స్ యోగ క్షేమాలు తెలుసుకునే వారు. అలాగే, ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఒకరు కాకపోతే మరొకరు.. ఏదో రకంగా ముచ్చట పెట్టేవారు. అలా చేయడం వల్ల ఒంటరి తనం అనేది కనిపించకుండాపోయేది. మానసిక రుగ్మత గతంలో చాలా తక్కువ. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖాళీగా ఉన్నా సరే పక్కన ఉన్నవాళ్లతో మాట్లాడడం లేదు. ఇంట్లోని తలా ఒక్కరు.. స్మార్ట్ ఫోన్ చేతుల్లోకి తీసుకొని దానికి అడిక్ట్ అవుతున్నారు. రీల్స్ నుంచి మొదలుకొని వివిధ వీడియోలను అందులోనే చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఎవరైనా అడిగితే నాకు తీరిక ఉండడం లేదు.. బిజీ లైఫ్.. ఉద్యోగంలో ఒత్తిడి, టెన్షన్స్ వీటన్నింటి మధ్య స్నేహ బంధాలు కొనసాగించే సమయం మాకు ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల అడిక్షన్ అనేది కరోనా తర్వాత బాగా పెరిగిందంటున్నారు మానసిక నిపుణులు. ప్రస్తుత బిజీ షెడ్యూల్స్ వల్ల కూడా సమయం ఎవరికీ ఉండడం లేదని, అందుకే ‘సమయం లేదు మిత్రమా’ అంటూ.. బలపడే స్నేహబంధానికి మొదటి పది నిమిషాల్లోనే టాటా, బైబై చెప్పేసి వెళ్తున్నారని, దీని వల్ల స్నేహ బంధాలు ఉండడం లేదని మరికొన్ని సంస్థలు చెబుతున్నాయి.

స్నేహమాంద్యం పెరగడం ప్రమాదకరం
పోస్ట్ కోవిడ్-2019 తర్వాత స్నేహమాంద్యం (ఫ్రెండ్షిప్ రెసిషన్) సమస్య ఇంకా పెరుగుతూ వస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా డిజిటల్ లైఫ్. ప్రత్యక్షంగా కలువకుండా ఆన్లైన్ మీటింగ్‌లు, చాటింగ్‌లపై ఎక్కువ శ్రద్ధపెడుతున్నారు. ఆన్లైన్ అనేది ఓ సమస్యగా మారుతోంది. అలాగే, బిజీ లైఫ్‌ైస్టెల్ కూడా ఒక కారణం. ఇప్పటికే యూఎస్ఏ లాంటి దేశాలు స్నేహమాంద్యాన్ని గుర్తించాయి. వీటికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో పబ్లిక్ హెల్త్ క్రైసిస్గా మారుతుందని ఇప్పటికే తెలుసుకున్నాయి. స్నేహమాంద్యం వల్ల వల్ల డిప్రెషన్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కలిగినప్పుడు షేర్ చేసుకోవడానికి పక్కన ఎవరూ ఉండరు. తన బాధలు, ఇబ్బందులు పంచుకునే వారు లేక.. ఒక్కోసారి ఆత్మహత్య వైపు వెళ్లే ప్రమాదాలు అధికమవుతాయి.
ఇలా మానసికంగా బాధపడడం, ఒంటరి అయినట్లుగా ఫీల్ అవ్వడం, మనసు విప్పి మాట్లాడుకోకపోవడం, నలుగురిలో కలువకపోవడం వంటి పలు అంశాలు మనిషి ఆయుష్సు కూడా తగ్గించే ప్రమాదం ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల గుండెపోట్లు పెరిగే ప్రమాదాలు అధికంగా ఉంటాయి. ఆన్లైన్ సంబంధాలు తగ్గించుకోవడమే కాకుండా.. చిన్నా, పెద్ద సోషల్ గ్యాదరింగ్లకు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. సేవా కార్యక్రమాలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల వంటి వాటికి వెళితే.. అక్కడ కొత్త స్నేహితులను చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే, ఒంటరిగా ఉన్నప్పుడు.. స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ కాకుండా.. అవకాశం ఉన్నప్పుడు చిన్న నాటి మిత్రులు, ఇతర ఆప్తులకు ఫోన్‌చేసి మాట్లాడితే.. పాత స్నేహాలు మళ్లీ ప్రారంభమవుతాయి. తద్వారా ఈ స్నేహ మాంద్యం నుంచి బయటపడే మార్గం ఉంటుంది.
– డాక్టర్ సాయి కృష్ణ, సైకియాట్రిస్టు (కరీంనగర్)