ఇన్నాళ్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని అరిగోసలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోసారి భూముల ధరలను సవరించి పెను భారం మోపేందుకు సిద్ధమవుతున్నది. పెంచిన భూముల ధరలతో మారనున్న రిజిస్ట్రేషన్ చార్జీలతో మరోసారి జనాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నగరంలో హెచ్ఎండీఏ విస్తరించి ఉన్న ప్రాంతం వరకు ఓపెన్ ప్లాట్లు, రెసిడెన్షియల్ భవనాలు, కమర్షియల్ పార్కుల రిజిస్ట్రేషన్ల కోసం భారీ వ్యత్యాసంతో సామాన్యుడి జేబు నుంచి సర్కార్ అదనంగా తీసుకోనున్నది. ప్రస్తుతం స్టాంప్ అండ్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండింతలు చేసుకోవడమే లక్ష్యంగా డబుల్ భారానికి సిద్ధమైన నేపథ్యంలో… ప్రస్తుతం ఉన్న ధరలు నేటీ నుంచి 50-100 శాతం మారిపోనున్నాయి.
సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిన రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వీర్యం చేసేంత వరకు కాంగ్రెస్ సర్కార్ విడిచిపెట్టేలా లేదని తాజా భూముల విలువ సవరణతో తేలిపోయింది. ఇన్నాళ్లు హైడ్రా కూల్చివేతలు, చెరువుల ఆక్రమణలు, అసైన్డ్ భూముల పేరిట నిషేధిత జాబితా, భూభారతిలో మార్పులతో రియాల్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో పుండు మీద కారం చల్లిన చందంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని అథః పాతాళానికి తొక్కడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కేవలం అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లను ముందుగా కూలగొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం… ఇప్పుడు నగరంలో అసలు ఇండ్లే కొనకూడదనే స్థాయికి సగటు మనిషిని తీసుకువస్తోంది.
సర్కార్‌కు వచ్చే ఆదాయాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని మార్పులు చేస్తుండటంతో రిజిస్ట్రేషన్ల రూపంలో భారం పడనుంది. రియల్ ఎస్టేట్ రంగానికి భూముల ధరలే కీలకం. ఈ ధర ఆధారంగానే కొనుగోలుదారులు, అమ్మకందారులు మార్కెట్ ధరను నిర్ణయిస్తారు. దీనికి అనుగుణంగా అమ్మకాలు జరుగుతాయి. కానీ సబ్ రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువ మధ్య భారీ వ్యత్యాసం ఉందనే అంశాన్ని ఆదాయంగా మలుచుకుంటున్నది.
నిజానికి భూముల ధరలు సవరించడం వలన అమ్మకందారులకు వచ్చే నష్టం కంటే ముందుగా కొనుగోలుదారుల అంచనాలు తలకిందులు కానున్నాయి. గృహా రుణాల కోసం అప్పులు చేసి సర్దుబాటు చేసుకునే సామాన్యుడికి ఇదీ ఊహించనీ అదనపు భారం కానుంది. ఎలాగంటే నగరంలో ఏదో ఒక చోట కొనుగోలు చేసిన ఇంటికి రిజిస్ట్రేషన్ విలువ 3 లక్షలు అంచనా వేసుకుంటే.. పెరిగిన ధరలతో ఆ చార్జీల విలువ రెండింతలు కానున్నది. ఇలా నగరంలో ఇప్పుడున్న రేట్లను రెండింతలు చేసి సర్కార్ సొంతింటి కోసం కలలు గనే సామాన్యుడి నడ్డి విరుస్తోంది.
ఎలా మారుతుందంటే…
బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లోని ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యమని చెప్పుకొంటున్న ప్రభుత్వం… మరీ బహిరంగ, ప్రభుత్వ రేటుతో సరి సమానం చేయడం వల్ల కేవలం సర్కార్‌కు వచ్చే ఆదాయం రెండింతలు అవుతుందే తప్ప.. సామాన్యుడికి కలిగే ప్రయోజనం శూన్యం. రిజిస్ట్రేషన్ల కోసం అదనంగా సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. ఎలాంటి ప్రస్తుతం తెలంగాణలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై మొత్తం 7.5శాతంలో స్టాంప్ రుసుం, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కలిపి వసూలు చేస్తుంది. వీటిని కేవలం ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూముల విలువ ఆధారంగానే లెక్కిస్తున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌కు ప్రామాణికమైన ఆ విలువను సవరించడం వలన పాత ధరలో కంటే అదనంగా ఫీజు చెల్లించాల్సి రానుంది. దీనికి వివిధ ప్రాంతాలో పెరిగిన భూముల విలువలు, వాటి స్టాంప్ డ్యూటీల్లో వచ్చిన మార్పులను ఉజ్జాయింపు విలువతో విశ్లేషిస్తే… నేటి నుంచి రిజిస్ట్రేషన్ల కోసం కట్టే మొత్తం రెండింతలు కానుంది.
ఛార్జీలు రెండింతలు…మారనున్న బడ్జెట్
ఐటీ కారిడార్‌లో బహిరంగ మార్కెట్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ ధరలు దానికి తక్కువగా ఉండేవి. మాదాపూర్ ప్రాంతంలో ఒక 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ఉదాహరణకు చదరపు అడుగుకు ప్రభుత్వ విలువ రూ. 3500 ఉంటే, బహిరంగ మార్కెట్లో రూ. 7000గా ఉంది. అయితే 50-100 శాతం ధరలను సవరిస్తే. సగటున 75శాతం సవరించినా… అధికారిక విలువ కనీసం రూ. 6100/చ. అడుగుకు కానుంది.
ఈ లెక్కన ఆ ఫ్లాటు రిజిస్ట్రేషన్ కోసం పాత లెక్క ప్రకారం రూ. 5250000/- ధరకు 7.5శాతం స్టాంప్ డ్యూటీ కట్టేందుకు రూ. 393750/-లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు ఈ భూముల ధరల సవరణ తర్వాత రూ. 686,250/-కు మారనుంది. దాదాపు 2.92లక్షలు రూపాయలు అదనంగా చెల్లించాల్సిందే. ఇలా నగరం వ్యాప్తంగా ఉన్న ప్రాంతాల వారీగా మారే ధరలతో సర్కార్‌కు వచ్చే ఆదాయం రెండింతలు అవుతుందే గానీ, సామాన్యుడికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు.
ప్రీ బుకింగ్ చేసుకున్నా డబుల్ కట్టాల్సిందే…
నిజానికి సర్కారుకు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశమే లేదనీ తాజా భూముల సవరణతో తేలిపోయింది. ఎంత సేపు పేదోడిని పొట్ట కొట్టే లక్ష్యమే తప్పా, సామాన్యుడిని సొంతింటి కొనుగోలు చేసుకోకుండా వెనక్కి లాగుతూనే ఉంది. ఎందుకుంటే ఆమ్ధానీ పెంచుకోవాలనే ఆత్యాశతో పెంచిన ధరలతో ఇప్పుడు డబుల్ కట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. చివరకు ఎప్పుడూ ప్రీ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం టైం సెట్ చేసుకున్న జనాలు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను కడితే గానీ, స్లాట్ బుకింగ్ చేసుకునే వీల్లేకుండా చేసింది. అప్పటివరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాదు.
ప్రోత్సాహాకాలతో మార్కెట్‌కు ప్రయోజనం
సర్కార్ అవసరాల రీత్యా భూముల ధరలు సవరించినా, సామాన్యుడిపై భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నగరంలో బహిరంగ, అధికారిక ధరల పట్టికలో వ్యత్యాసం ఉంది. కానీ రిజిస్ట్రేషన్ కోసం సర్దుబాటు చేసుకునే మొత్తంలో ఏ మాత్రం తేడా లేదు. ఇప్పుడు సర్కార్ చేయనున్న భూముల సవరణతో పెద్ద బిల్డర్‌కు వచ్చే లాభం కంటే… సామాన్యుడిని కొనుగోలు చేసే విధంగా సర్కార్ కొన్ని ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం మహిళల పేరిట జరిగే రిజిస్ట్రేషన్లపై చార్జీల రాయితీ, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలను కనీసం 40-50 శాతానికి తగ్గించడం వల్ల పెరిగిన భారం సామాన్యుడిపై నేరుగా పడకుండా ఉంటుంది.
– రాజశేఖర్ రెడ్డి, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు
ఆదాయం కోసం సామాన్యుడి జేబుకు చిల్లు
నగరంలో ఎంతో మంది సామాన్యులు సొంతింటి కోసం కలలుగంటారు. అలాంటి వారంతా గడిచిన రెండేళ్ల కాలంగా రియల్ ఎస్టేట్ రంగంపై కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనికి కాంగ్రెస్ సర్కార్ చేసిన హైడ్రా విధ్వంసం, రిజిస్ట్రేషన్ పేరిట సామాన్యులతో చెలగాటం ఇప్పటికీ రియల్ ఎస్టేట్ అంటేనే జంకుతున్నారు. ఇప్పుడు కడుపు కట్టుకుని కూడబెట్టి, అప్పులు చేసిన డబ్బులతోనైనా ఇంటి కల సాకారం అవుతుందనే లోపు… ఇప్పుడు సర్కార్ భూముల ధరలు సవరించి రిజిస్ట్రేషన్ అవుతుందనే సంబరం కూడా లేకుండా చేస్తోంది. దీంతో సామాన్యుడి జేబు గుల్లా చేయడమే తప్ప.. అదనంగా వచ్చే లాభం ఏమాత్రం లేదు. సర్కార్‌కు చాలీచాలనీ జీతాల ఆర్థిక ప్రమాణాలను లెక్కలోకి తీసుకోనైనా పెంచిన చార్జీలను తగ్గించాల్సిన అవసరం ఉంది.
– నారగోని ప్రవీణ్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
