ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(కే) పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన కొడప సురేశ్-యశోద దంపతుల కుమారుడైన రాజేశ్‌కు పుట్టిక నుంచి రెండు కాళ్లు, చేతులు ముడుచుకుపోయాయి. గ్రామంలోని ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల తమ కొడుకు కాళ్లు, చేతులు పనిచేయడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. దవాఖానల్లో చూపించిన ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందే తాము కాళ్లు, చేతులు పనిచేయకపోవడంతో ఇంటి వద్ద ఉంటూ కుమారుడి బాగోగులు చూసుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. గ్రామంలో పలువురు ఫ్లోరైడ్ నీరు తాగి నడుం, కాళ్లు, చేతుల సమస్యతో బాధపడుతున్నారు. రాజేశ్‌కు పింఛన్ కోసం ప్రయత్నాలు చెద్దామని ఆధార్ కార్డు కోసం వెళ్తే చేతి వేలిముద్రలు రాకపోవడంతో ఆధార్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పింఛన్ అయిన ఇప్పించాలని వేడుకున్నారు.

ఆదిలాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(కే) గ్రామ పంచాయతీ పరిధిలో గల దుబ్బగూడ గిరిజనులు ఫ్లోరైడ్ నీటి సమస్యతో అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో 45 కుటుంబాలు ఉండగా 190 జనాభా ఉంది. వీరందరూ వ్యవసాయం చేసుకంటూ ఉపాధి పొందుతారు. గ్రామంలో నాలుగు చేతిపంపులు ఉన్నాయి. ఈ నీటినే కొన్నేండ్లుగా ఆ నీటిని స్థానికులు తాగుతున్నారు. నీరు కలుషితంగా ఉండడంతో అనారోగ్యం బారిన పడుతూ మంచాలకే పరిమితమవుతున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోర్ నీటినే తాగుతున్నారు. కొన్నేండ్లుగా ఫ్లోరైడ్ నీటిని తాగుతుండడంతో అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లలు వైకల్యంతో జన్మించడంతోపాటు కాళ్లు, చేతులు సరిగా పనిచేయడం లేదంటున్నారు. రోజుంతా నీరసంగా ఉండడంతో వ్యవసాయ పనులు చేయలేకపోతున్నామని, కొద్ది సేపు నిల్చోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది వెన్నెముక సమస్యతో వంగిపోతున్నారు.
నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్
గ్రామంలోని బోరు బావుల్లోని నీటిని పరిశీలించిన అధికారులు ఫ్లోరైడ్ ఉందని, నీటిని తాగొద్దని సూచించారని స్థానికులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం వైద్యులను సంప్రదించగా ఫ్లోరైడ్ నీరు కారణమని సూచించారన్నారు. గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారించడానికి ఐటీడీఏ నుంచి రూ.3 లక్షలతో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేసిన బోర్ కనెక్షన్ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో స్థానికులు గ్రామంలోని బోర్ల పైనే ఆధారపడుతున్నారు. అత్రం భీంరావు అనే రైతు ఫ్లోరైడ్ సమస్య కారణంగా నడుము, కాళ్లు, చేతులు పనిచేయకపోవడంతో నాలుగేండ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. వ్యవసాయ పనులు చేయలేక పోతున్నాడు. కొడప రాకేశ్ అనే బాలుడు కాళ్లు, చేతులు ముడుచుకుపోవడంతో తల్లి సేవలు చేస్తున్నది. గ్రామంలో 13 మంది ఫ్లోరైడ్ బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమ గ్రామంలోని ఫ్లోరైడ్ నీటి సమస్యను పరిష్కరించి మంచినీటిని అందించాలని ప్రజాప్రతినిధులు అధికారులను పలుమార్లు కోరిన ఫలితం లేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి మంచినీటిని అందించాలని కోరుతున్నారు.

బోర్ నీటిని తాగుతున్నాం..
మా గ్రామంలో నాలుగు చేతి పంపులు ఉన్నాయి. కొన్నేండ్లుగా ఈ నీటిని తాగుతున్నాం. నాకు నడం సమస్య కారణంగా వంగిపోయి నడుస్తున్నా. డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకుంటే ఫ్లోరైడ్ నీరు తాగడంతో మీకు ఇలా అయిందని చెప్పాడు. బోరు నీటిని తాగొద్దని సూచించారు. గ్రామంలో 13 మంది ఫ్లోరైడ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి పనులు చేసుకోలేక నీరసంగా ఉంటున్నా. మంచినీరు దొరకకపోవడంతో ఫ్లోరైడ్ నీటిని తాగుతున్నా. అధికారులు స్పందించి మా గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నా.
– మడావి మారుతి, స్థానికుడు. దుబ్బగూడ, బేల మండలం