మారేడ్‌పల్లి, జూన్ 4 : గూగుల్ మ్యాప్స్‌లో బస్తీలు.. కాలనీలను పరిశీలిస్తాడు.. ఎంచుకున్న కాలనీని గూగుల్ స్ట్రీట్ వ్యూలో మరోసారి పరిశీలించి.. నేరుగా ఆ ప్రాంతానికి వెళ్తాడు.. అక్కడ టూలెట్ బోర్డులు సమీపంలో తాళం వేసిన ఇండ్లను ఎంచుకొని ఐదు నిమిషాల వ్యవధిలో ఇంటి తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న సొత్తును అపహరిస్తున్న అంతరాష్ట్ర హైటెక్ దొంగను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లోని మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిసిపి శ్రీధర్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మోండా మార్కెట్ పరిధిలోని పాట్ మార్కెట్లో శ్రీ సాయి బులియన్ జ్యూవెల్లరీ షాప్‌లో ఉద్యోగిగా పని చేస్తున్న సందీప్ రఘునాథ్ చవాన్ ఇంట్లో మే 27న ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేసి అక్కడి నుంచి పరారైయ్యాడు. వెంటనే బాధితుడు మార్కెట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, హైదరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టి దొంగ ఎవరు..? అనే విషయాన్ని గుర్తించారు.
ఢిల్లీకి చెందిన పాత నేరస్తుడు మనోజ్ కుమార్ సింగ్ (28 ) చోరీ కేసులలో అరితేరాడు. హైటెక్ పద్దతిలో రెక్కీ నిర్వహిస్తాడు.. గూగుల్ మ్యాప్‌లలో చిన్న చిన్నగా ఉండే రోడ్లు, అక్కడ రద్దీ లేని ప్రాంతాలను ఎంచుకుంటాడు. ఆ తరువాత స్ట్రీట్ వ్యూలో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాడు. అక్కడకు వెళ్లి టూలెట్ బోర్డులు ఎక్కడున్నాయి… తాళాలు వేసిన ఇండ్లు ఎక్కడున్నాయనే విషయాలను ఆరా తీస్తాడు. ఇలా రెక్కీ నిర్వహిస్తూ అవకాశాన్ని బట్టి తాళం వేసిన ఇంటిని ఎంచుకొని ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో ఆ ఇంటిని లూటీ చేస్తాడు.
ఇలా మే 27న హైదారబాద్‌కు వచ్చి సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను గూగుల్ మ్యాప్‌లో పరిశీలించాడు. మొదట ఎస్ఆర్నగర్ ప్రాంతాన్ని ఎంచుకున్న అక్కడ రోడ్లన్ని రద్దీగా ఉండడంతో తన ఫ్లాన్‌ను మరో ప్రాంతానికి మార్చేశాడు. ఈ క్రమంలో మోండా మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిని గుర్తించాడు. ఇంటి యజమాని తాళం వేసి పైఅంతస్థులో ఉండగానే… కింద తాళం ఉండడంతో ఆ ఇంటి తాళం పగుల గొట్టి లోపలికి ప్రవేశించి, ఇంట్లోని విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించి అక్కడి నుంచి పరారైయ్యాడు. ఇంటి యజమాని పై అంతస్థులో ఉండగా, ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని స్థానికులు గమనించి ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకురావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. సికింద్రాబాద్ నుంచి అబిడ్స్ వరకు నిందితుడి కదలికలను సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తూ చివరకు హైదరాబాద్‌ను వదిలేశాడనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. దొంగ వివరాలను సేకరించి ఎక్కడున్నాడని ఆరా తీయడంతో గోవాలో ఉన్నట్లు బయటపడింది. దీంతో మార్కెట్ పోలీసులు జూన్ 1న ఉత్తర గోవాలోని కలగగూట్ పోలీసు స్టేషన్ పరిధిలో నింధితుడు మనోజ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించడంతో ఢిల్లీలోనే 19 చోరీ కేసులు నమోదు అయి ఉన్నాయని బయటపడింది. పలు కేసులలో నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన మార్కెట్ పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు. చోరీకి గురైన సుమారు రూ. 82 లక్షల సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు.