మెదక్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని వాగులు, నదులు, వంకల్లో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. మంజీరా నదితో పాటు హల్దీ వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక వ్యాపారులు అక్రమంగా ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో తవ్వకాలు చేసి వాహనాల ద్వారా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవె న్యూ, పోలీసు శాఖ మధ్య సమన్వయ లోపం ఉండడంతో ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కొందరు పగలు ఇసుక తవ్వకాలు చేసి, అటవీ ప్రాంతంతో పాటు వాగు పరిసరాల్లో నిల్వ చేసి రాత్రి సమయంలో లారీలు, టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. అధికార పార్టీ నేతల మద్దతు ఉండడంతో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నది. మెదక్, హవేళీ ఘనపూర్, పాపన్నపేట, కొల్చారం, వెల్దుర్తి, రామాయంపేట, చిన్నశంకరంపేట, అల్లాదుర్గం, పెద్దశం కరంపేట మండలాల్లో ఎక్కువగా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ. 5 వేలకు అమ్ముతున్నారు.
నెలనెలా మామూళ్లు..?
హల్దీవాగుతో పాటు మంజీరా నది, వాగుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇసుకను కుప్పలుగా చేర్చి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతలు, అధికారుల కనుసైగల్లో దందా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులకు ఇసుక మాఫియా నెలనెలా భారీగా మామూళ్లు ఇస్తుండడంతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా వాహన తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. మెదక్ ప్రాంతం నుంచి ప్రతిరోజు హైదరాబాద్, జహీరాబాద్, బీదర్‌కు ఇసుకను లారీల్లో తరలిస్తున్నారు. హల్దీ వాగులో అక్రమంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో చెక్‌డ్యామ్‌లకు ముప్పు ఏర్పడుతుందని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ ప్రాంతం నుంచి ఇసుకను తరలించేందుకు హవేళీఘనపూర్, మెదక్ రూరల్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్ద శంకరంపేట పోలీస్స్టేషన్ల సిబ్బందికి మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ వైపు తరలించే వారు చిన్న శంకరంపేట, చేగుంట, మనోహరాబాద్, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్‌కు చెందిన రెవెన్యూ, పోలీసు అధికారులకు మామూళ్లు ఇచ్చి ఇసుక వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్, బీదర్ వైపు నిత్యం లారీలలో పరిమితికి మించి ఇసుక అక్రమంగా తరలిస్తున్నా పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.