మోర్తాడ్, ఆగస్టు 16: పసుపు పంట సాగుకు ఆర్మూర్ ప్రాంతం ప్రసిద్ధి గాంచింది. పచ్చ బంగారంగా పేరొందిన ఈ పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తుందన్న భావన ఉండేది. కానీ, కొన్నేళ్లుగా లాభాల సంగతి దేవుడెరుగు, ఏటా నష్టాలే మూట గట్టుకుంటున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి సాగు చేసే ఈ పంట మార్కెట్కు తరలించే వరకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. మార్కెట్కు తరలించాక పసుపు అమ్మేందుకు పడే తంటాలు వేరు.
ఎంతో ప్రయాస పడి పండించే పంటుకు మద్దతు ధర వస్తుందా అంటే అదీ లేదు. నిరుడు కూడా పసుపునకు నిజామాబాద్ మార్కెట్లో రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే ధర పలికింది. గిట్టుబాటు కాకపోయినా రైతులు పసుపు సాగు మానడం లేదు. ఈసారైనా ధర రూ.15వేలు దాటుతుందనే ఆశతో రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో పంటలు గట్టెక్కుతాయా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పసుపు వేసిన చాలా మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటకు నీరందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డ్రిప్ కారణంగా పంటకు సరిపడా మాత్రమే నీరందుతుంది. తద్వారా నీటి వృథా కాకుండా ఉంటుంది. పసుపు రైతులు దాదాపు బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న తరుణంలో డ్రిప్ పద్ధతి ఉపయుక్తంగా మారింది. యూరియా తక్కువ వినియోగంతో పాటు సేంద్రియ ఎరువులను వాడడంతో తెగుళ్లను కూడా అరికట్టే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, బెడ్ సిస్టమ్లో పసుపు పండిస్తే దిగుబడులు ఎక్కువగా సాధించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
ఎల్నినో ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురియడం లేదు. ఈ నేపథ్యంలో పసుపు రైతులకు కష్టాలు తప్పేలా లేవు. ఎన్నో అశలతో పసుపు విత్తిన రైతులు.. సరైన వర్షాలు లేకపోవడంతో పంట చేతికొస్తుందా? అన్న ఆందోళనలో పడిపోయారు. అయితే, వర్షాల రాక ఆలస్యమవడంతో వేసిన పంట నష్టపోయినట్లేనని భావించిన రైతులకు ఇటీవల కురిసిన వానలు ఊపిరి పోశాయి. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 22,971 ఎకరాల్లో పసుపు సాగు కాగా, ఈసారి 25 నుంచి 30 వేల ఎకరాల వరకు పెరుగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో వర్షాలు లేక భూగర్భజలాలు తగ్గితే రైతులు పంటను ఏవిధంగా కాపాడుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే పసుపు దీర్ఘకాలిక పంట. తొమ్మిది నెలల పాటు సాగయ్యే ఈ పంట గట్టెక్కడంపై ఆందోళన నెలకొంది.
ఐదేండ్లుగా పసుపు పండిస్తలేను. ఈసారి రెండెకరాల్లో పసుపు వేశాను. బోర్లే మాకు ఆధారం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పం టకు నీరందించేందుకు డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాను. పసుపు పండించడం కష్టంతో కూడుకున్నదేనని తెలిసిన మార్కెట్కు వెళ్లే సమ యానికి దళారుల కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఈసారి పసుపు రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు చూస్తారన్న ఆశతో పంట సాగు చేస్తున్నాం.
– తెడ్డు రాజన్న, రైతు, హాసాకొత్తూర్
పసుపు పంటకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించడం మేలు. ఎందుకంటే మొక్కకు కావాల్సిన నీటిని నేరుగా మొక్క దగ్గరే పడేట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా నీటి వృథా అనేది ఉండదు. మొక్క ఉన్న చోట ఎక్కువగా నీరు నిలిస్తే దుంపకుళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. డ్రిప్ సిస్టమ్తో ఈ బెడద తగ్గుతుంది. యూరియా తక్కువగా వాడడం మంచిది.
– రాజు, హార్టికల్చర్ అధికారి, మోర్తాడ్