అర్వపల్లి, ఆగస్టు 16 : కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లారా ఖబడ్డార్..బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హెచ్చరించారు. తిమ్మాపురంలో గురువారం బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ గూండాల దాడికి గురైన బీఆర్ఎస్ యువజన నాయకుడు గునగంటి చంద్రకాంత్‌గౌడ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయనకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషోర్‌కుమార్ మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశాంత వాతావరణంలో జీవించిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ దాడులు, హత్యలను ప్రోత్సహిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. చంద్రకాంత్ గౌడ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అర్వపల్లి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు పిటిషన్ ఇస్తే స్థానిక సీఐ, ఎస్సైలు అధికార పార్టీ కొమ్ము కాస్తూ దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై చిన్న కేసులు పెట్టి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చారన్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చిన మరుసటి రోజే ఓ కాంగ్రెస్ నాయకుడు మేము దాడి చేయకపోతే ఎట్లా.. మా పార్టీని నిలబెట్టుకోవద్దా అంటుంటే..స్థానిక ఎస్సై నవ్వడం ఏమిటన్నారు. అంటే మీరు దాడులను ప్రోత్సహిస్తున్నారా అని పోలీసులను ప్రశ్నించారు. మీ ఇష్టమొచ్చినట్లు పని చేస్తామంటే ఊరుకోబోమని, రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు. రాబోయే రోజుల్లో మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఎక్కడున్నా వదిలిపెట్టమని, వడ్డీతో సహా చెల్లిస్తామని పోలీసులను తీవ్రంగా హెచ్చరించారు. తిమ్మాపురం దాడి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
చంద్రకాంత్గౌడ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రూ. 25వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఇటీవల గాయపడిన పర్సాయపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఎర్ర నర్సయ్యను, అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకుడు కొర్రపీడ వీరయ్యను పరామర్శించారు. కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, మొరిశెట్టి ఉపేందర్, మాజీ వైస్ ఎంపీపీ మారిపెద్ది భవాని, సర్పంచ్‌లు బొడ్డు ఇందిరా సోమరాజు, కర్నాటి వెంకన్న, మేడి వీరస్వామి, నున్న యాదగిరి, బాణోతు సైదులు, గ్రామశాఖ అధ్యక్షుడు కందుల దశరథ రామారావు, ఎల్లం రాజు, సంపతి కిరణ్, కొమ్మినేని సతీష్, బొడ్డు రామలింగయ్య, చల్లా వేణుధర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, యుగంధర్, మహేశ్వరం సందీప్, సురేష్, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.