కాలుష్యం వెదజల్లడంలో ఆటోలు, బస్సులు పోటీపడుతున్నాయి. ఒకదానికి మించి మరొకటి అన్నట్టు బుసలు కొడుతున్నాయి. మహానగరంలో వాహన కాలుష్య నమోదులో అత్యధికంగా బస్సులు, ఆటోలే ఉన్నాయి. ఇటీవల ఆర్టీఏ అధికారులు కాలుష్య వాహనాలపై చేసిన తనిఖీల్లో బస్సులు, ఆటోలతోనే అత్యధిక కాలుష్యం నమోదవుతున్నట్టు గుర్తించారు. కాలం చెల్లిన వాహనాలు అత్యధికంగా ఉండటం వల్ల వాటి నుంచి పొగలు చిమ్ముతున్నాయి. చాలా వరకు పీయూసీ లేకుండానే అవి రాకపోకలు సాగిస్తున్నాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : కాలుష్య నమోదుకు కారణమవుతున్న ఆ బస్సుల వివరాలను ఆర్టీసీ అధికారులకు పంపినట్టు ఓ రవాణా శాఖ అధికారి తెలిపారు. ఆటోలకు జరిమానాలు విధించినట్టు వివరించారు. చాలా బస్సులు రోడ్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. తర్వాత కార్లు, క్యాబ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే నగరంలో 2800-3000 బస్సుల వరకు రోడ్డెక్కుతున్నాయి. ఇందులో ఆర్డీనరీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, లగ్జరీ బస్సులున్నాయి. బస్సులో సగానికి పైగా పాడైన, కాలపరిమితి దాటిన బస్సులే ఉన్నాయి. ఇంజన్లో సమస్యలు, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్లు సమయానికి మార్చకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు మహానగరంలో ఆటోలు 1.40లక్షల వరకు ఉన్నాయి. వీటిలో అత్యధిక ఆటోలు కాలుష్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత మరింత అధికంగా ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, కోఠి, అఫ్జల్‌గంజ్, మెహిదీపట్నం, కొండాపూర్, సనత్‌నగర్ తదితర ప్రాంతాలు బస్సులు, ఆటోలతో రద్దీని తలపిస్తాయి. ఈ ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించి కాలం చెల్లిన పలు బస్సులు, ఆటోలను గుర్తించారు.

Vehicle Pollution
జరభద్రం..!
నగరంలో 88 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. ఇందులో 80 శాతం వాహనాలకు పీయూసీ లేనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ప్రతీ నెలకు 27వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. సాధారణ ప్రాంతాలతో పోల్చితే ఒక్కో సిగ్నల్ వద్ద 25 శాతానికి పైగా అధిక కాలుష్యం వెలువడుతుందని పర్యావేరణవేత్తలు చెబుతున్నారు. ఇలా నగరంలో ప్రతీ రోజు 1500 టన్నుల పొగ పోగవుతున్నట్టు గతంలో సర్వేలు సైతం వెల్లడించాయి. కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి, హైడ్రో కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్, సీసం, కార్బన్ పొడులు గాలిలో కలుస్తున్నాయి. వీటిని పీల్చుకోవడంతో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ బారినపడాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్లో సుమారు మూడు వేలకుపైగా ట్రాఫిక్ జంక్షన్లు ఉన్నాయి.
ఇందులో సుమారు 1400 జంక్షన్లలో 30 సెకండ్లకు మించి సిగ్నల్స్ పడుతున్నాయి. కొన్ని సార్లు 2 నిమిషాలు, 30-180 సెకండ్లు కూడా పడుతున్నాయి. ఒక్కో సిగ్నల్ వద్ద వందల్లో వాహనాలు నిలుస్తున్నాయి. ఒక వాహనం 40 పీపీఎం కార్బన్ డయాక్సైడ్ చొప్పున కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఇలా ఒక్కో సిగ్నల్ వద్ద ఆగేవారు 8వేల పీపీఎం కార్బన్ డయాక్సైడ్తో పాటు ఇతర కాలుష్యాన్ని పీల్చుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.