Sarangapur | సారంగాపూర్, నవంబర్ 17: వరి కొయ్యల అవశేషాలను కాల్చడం వల్ల సేంద్రీయ పదార్థాలు, పోషకాలు నశిస్తాయని నేలలోఉన్న వానపాములు సూక్ష్మజీవులు వేడితో చనిపోతాయని సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామంలో పర్యటించి రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. రైతులు వరిపంటలు కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చివేస్తున్నారని, వాటి వల్ల నష్టం జరుగుతందని అన్నారు. వాయు కాలుష్యం పెరిగి కార్బన్ ఉద్గారాలు వాతావరణ మార్పులకు దారితీస్తాయన్నారు.
పోలంలో గాలి ప్రసరణ, నీటి చొరబాటు తగ్గి తదుపరి పంట దిగుబడి పడిపోతుందన్నారు. భూమి గట్టిపడి క్రమేపి చౌడుభూమిగా మారుతుందన్నారు. కోత తర్వాత పరి కోయ్యలను కాల్చకుండా పొలంలోనే ఉంచాలని, పాలంలో నీరు పెట్టి ట్రాక్టర్ రోటోవేటర్ 25 రోజుల్లోరెండు సార్లు దమ్ము చేస్తే వరి గడ్డి కుళ్లిపోయి పంటకు సేంద్రీయ కార్బనం అందుతుందని ఆ తర్వాత వరి నాట్లు వేసుకోవాలని రైతులకు సూచించారు. అలాగే గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఈఓ వెంకటేష్, రైతులు, సెంటర్ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.