సబర్మతి రివర్ ప్రాజెక్టు దేశానికి ఆదర్శం. కానీ ఇప్పుడు ఆ నదియే అత్యంత దయనీయంగా బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్‌తో దేశంలోనే రెండో కలుషిత నదిగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు రెండో దశ నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. 2005లో మొదలైన సబర్మతి నదీ పరీవాహక ప్రాంతం అభివృద్ధి పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో నదుల పునర్జీవం పేరిట కార్యకలాపాలతో సహజ
సిద్ధమైన పర్యావరణం, నదిలో జీవవైవిధ్యం నిర్వీర్యం కావడమే తప్ప.. ఏ మాత్రం కూడా కాలుష్య కారకాల నుంచి రక్షణ మాత్రం దొరకడం లేదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరహాలో కాంగ్రెస్ సర్కారు చేపడుతున్న మూసీ నది పునర్జీవం కూడా పర్యావరణ విధ్వంసానికి వేదికగా నిలుస్తున్నదని పర్యావరణవేత్తలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యథేచ్ఛగా కలుస్తున్న మురుగు నీరు,
ఇప్పటికీ అందుబాటులోకి రాని ఎస్టీపీలు, నదిలో అడ్డగోలుగా జరుగుతున్న నిర్మాణాలతో నది మనుగడకే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. కానీ సర్కారు మాత్రం లక్షల కోట్ల రూపాయాలతో సబర్మతి తరహా మరో కాంక్రీట్ నదిగా మార్చేందుకు సిద్ధమవుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.

Sabarmati
సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : 20 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సబర్మతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పనులు 2005లో పనులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సబర్మతి నది పరీవాహక రీక్రియేషనల్ జోన్‌గా, ఆహ్లాదకరమైన సుందర వనాలు వంటి ఏర్పాటు చేయడానికి తీర్చిదిద్దింది. కానీ ఇంకా రెండో దశ పనులు పూర్తికాలేదు. ఇప్పటికీ నదిలోని ఐదు ప్రాంతాల్లో కాలుష్యం ఉందని 2022లో లోక్‌సభ వేదికగానే కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదికలోనూ గాంధీ నగర్ రేసన్, డోక్లాలోని వౌతా ప్రాంతాల్లో లీటర్ సబర్మతి నీటిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 292 మిల్లీ గ్రాముల పరిమాణంలో ఉందని తేల్చింది. దాదాపు ఐదు ప్రాంతాల్లో పరిమితికి మించిన బీవోడీ విలువ నమోదైందని, డ్రైనేజీ నీరు నదిలో చేరడం.. నదీ పరిసరాల్లో మొదలైన కాంక్రీట్ నిర్మాణాలు కారణాలుగా తేల్చింది. దేశంలోనే రెండో కలుషిత నదిగా సబర్మతి నిలుస్తున్నదని, తొలి స్థానంలో తమిళనాడులోని కువం నది ఉన్నట్లుగా పేర్కొంది.
సహజసిద్ధంగా ప్రవహించే నదికి భౌగోళికంగానే మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి నదిలో పూడిక తీసి, సిమెంట్ బెడ్ వేయడం వలన అక్కడ ఉండే జీవవైవిధ్యంతోపాటు, జలసంపద, పరివాహాక ప్రాంతాల్లోనే ఉండే వృక్ష సంపద లేకుండా పోతుందంటున్నారు. ముఖ్యంగా నదిలోకి చేరే శుద్ధీ చేయని మురుగు నీటి పరిమాణం పెరుగుతుందంటున్నారు. వరదల సమయంలోనే నది అడుగున జరిగే భౌగోళిక మార్పులతో… సహజంగానే వరద నియంత్రణ జరుగుతున్నది. కానీ ఒకసారి సిమెంట్ నదిలో పడిందంటే స్వరూపమే మారుతుందంటున్నారు. దీంతో దిగువ నీటి ప్రవాహాం పెరిగి… వరద ముంపులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక నదిలోకి చేరుతున్న మురుగునీటిని నియంత్రించకుండా, ఎస్టీపీల ద్వారా శుద్ధి చేయకపోవడంతో ఏవిధంగా జలావరణం మెరుగుపడుతుందని ప్రశ్నిస్తున్నారు.
పోలికలెన్నో…
దేశంలో ఇప్పటివరకు నదుల అభివృద్ధి విషయంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. వీటి ద్వారా నది జలావరణమే దెబ్బతినడంతోపాటు, మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీలోని యమునా నదీ, గుజరాత్‌లోని సబర్మతితోపాటు, గంగానదీ వరకు అభివృద్ధి పనులతో మూసీ నదికి పోలికలున్నాయి. వీటిలో ఏ ఒక్క నది జీవవైవిధ్యం మెరుగుపడినట్లుగా నిర్ధారణ కాలేదు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం వేలకోట్లు ఖర్చు చేయనున్న రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఏవిధంగా మూసీ నదికి పునర్జీవం పోస్తుందని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా నదిలోకి చేరుతున్న వ్యర్థాలను నిలిపివేయకుండా చేస్తున్న ప్రయోగాలన్నీ నిష్ప్రయోజనమేనని మండిపడుతున్నారు.

Sabarmati
మూసీకి పొంచి ఉన్న ముప్పు
నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీ నదికి ఇరువైపులా రీక్రియేషన్ జోన్లు, అంతర్జాతీయ స్థాయి ఆఫీసు స్పేస్‌లతో కూడిన హైరైజ్ ప్రాజెక్టుల కోసం భూములు సేకరించేందుకు కాంగ్రెస్ సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. నదిలోని రివర్ బెడ్, ఎఫ్టీఎల్, ఇరువైపులా 50 మీటర్ల బఫర్‌జోన్ పరిధిలో వేలాది నిర్మాణాలను కూడా నేలమట్టం చేయనున్నది. సబర్మతి తీరంలోని జరిగిన విధ్వంసానికి కారణమైన కాంక్రీట్ నిర్మాణాల తరహాలోనే మూసీ పరిధిలోనూ హైరైజ్ నిర్మాణాలు, టూరిజం, ఐటీ పార్క్‌లను సర్కారు డిజైన్ చేయడంతో పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే యథేచ్ఛగా కలుస్తున్న మానవ, మురుగు వ్యర్థాలతో మూసీ పరివాహాక ప్రాంతం నివాస యోగ్యం కాదనే, భూగర్భజలాలు కలుషితమైనట్లుగా పలు అధ్యయనాలు చెబుతుంటే.. సబర్మతి తరహా అభివృద్ధి జీవనదికి ప్రమాదం పొంచి ఉందంటున్నారు.