Sandeep Reddy Vanga | ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో సంచలన విజయాలను అందుకున్న స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్ యువ నటులు సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రోమాంచకం’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సందీప్ సమర్పించబోతున్నాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చారు. చలనచిత్ర పరిశ్రమలో పంపిణీదారుగా తనకు ఇది మొదటి ప్రాజెక్ట్ అని వెల్లడించారు. కథ వింటున్నంత సేపూ తాను ఎంతగానో నవ్వుకున్నానని, ఈ వినోదం వెనుక ఒక బలమైన ఎమోషన్ కూడా దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఎంతో వైవిధ్యమైన మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ ‘రోమాంచకం’ సినిమా రాబోతోందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ (Spirit) 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో ప్రభాస్ షర్ట్‌లెస్ లుక్‌లో, ఒంటిపై గాయాలు, బ్యాండేజీలతో కనిపించి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశారు. లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో ఉన్న ప్రభాస్ లుక్.. సందీప్ వంగా మునుపటి చిత్రం ‘యానిమల్’లో రణబీర్ కపూర్ లుక్‌ను గుర్తుచేసేలా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.