Viral News : భార్య వేధింపులు భరించలేక ఓ వ్యక్తి వింత అభ్యర్థన చేశాడు. తన కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ కలెక్టర్‌కు లేఖ రాశాడు. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని సూరత్ (Surat) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన కిరిట్ పటేల్ (Kirit Patel) కు 2024లో స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. పెళ్లయినప్పటి నుంచి తన భార్య, అత్త డబ్బు కోసం తనను ఒత్తిడి చేస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నారని పటేల్ ఆవేదన వ్యక్తంచేశారు.
తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను తన భార్య దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఆమె అంతకుముందు పెళ్లి చేసుకుని వదిలేసిన వారిని కూడా ఇలాగే వేధించిందని, వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసిందని కలెక్టర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఆమె వేధింపులపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు.
భార్య వేధింపులు భరించలేకపోతున్నానని, ఈ నేపథ్యంలో తన కారుణ్య మరణానికి అనుమతివ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. గృహ హింస ఎదుర్కొంటున్న పురుషులకు చట్టపరమైన రక్షణ కొరవడిందని కలెక్టర్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, ఈ కారుణ్య మరణ అభ్యర్థనపై జిల్లా అధికారులు స్పందించాల్సి ఉంది.