Rythu Maha Dharna | పటాన్చెరు, జూన్ 21 : రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే ఓఆర్ఆర్ను దిగ్బంధం చేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో ఉన్న అంబేద్కర్ సర్కాల్ వద్ద ఏర్పాటు చేసిన రైతుల మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. పటాన్చెరు నియోజకవర్గంలో 22 వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. 22 వేల మంది రైతు కుటుంబాలతో ఓఆర్ఆర్ పై వంటావార్పు చేసి బంద్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా అభివృద్ది చేశారన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరగకుండా భరోసా కలిపించారన్నారు.
రైతులు వ్యవసాయ భూముల్లో పంటలు సాగు చేస్తున్నా ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు చెల్లించడం లేదన్నారు. కేసీఆర్ రైతులకు ఎకరానికి రూ.10 వేలు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫించన్ నెలకు రూ.2 వేలు ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.4వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలలో రైతులకు వ్యవసాయం కోసం 24 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేసిందన్నారు. కరెంట్ కోతలు లేకుండ సరఫరా చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు ప్రారంభమైన్నాయని ఆరోపించారు. అనుముల రేవంత్‌రెడ్డి కాదు కోతల రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు.
రైతుల కుటుంబాలు అప్పుల పాలు..
పటాన్చెరు ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు పంటలు సాగు చేసేందుకు అప్పులు చేసుకోనే పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల కుటుంబాలు అప్పుల పాలు కావడం జరిగిందన్నారు. రైతు భరోసాను ఎన్నిక భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అందరికి ఇస్తామని ప్రకటించిందన్నారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో రైతులకు రైతు భరోసా డబ్బులు వేయలేదని, మండలంలో ఒక్క గ్రామంలో ఉన్న రైతులకు వేశారన్నారు . ఓట్లు కోసం రైతు బంధు పథకంలో డబ్బులు వేస్తామని ప్రకటన చేశారని ఆరోపించారు. ఒక రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రైత భరోసా డబ్బులు రూ. 12 వేలు బాకి ఉందని, ముందుగా రైతులకు బాకీ ఉన్న రూ.12 వేలు వేయాలని డిమాండ్ చేశారు.
రైతులను చైతన్యం చేసి రైతు భరోసా కోసం పోరాటం చేస్తామన్నారు. దేవుండ్ల మీద ఒట్టు వేసి హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కటి అమలు చేయలేదన్నారు. రైతుల పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఇంత వరకు అమలు చేయలేదన్నారు. బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకోనే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు పంటలు సాగు చేసేందుకు రూ.3 వడీకి అప్పులు తీసుకోనే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు తీసుకోన్న పంట రుణాలు చెల్లించి, తిరిగి కొత్త రుణాలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలుపడంతో ఎంతో మంది రైతులు బ్యాంకులో ఉన్న అప్పులు చెల్లించారన్నారు. అప్పులు చెల్లించిన రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదన్నారు. రైతులకు భరోసా కలిపించేందుకు కేసీఆర్ రైతు బీమా పథకంను అమలు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.
కేసీఆర్ ఇచ్చిన పథకాలను బంద్ చేసేందుకు..
రైతులు చనిపోతే కేసీఆర్ ప్రభుత్వం రైతు కుటుంబానికి రూ.5 లక్షల భీమా డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. రైతులకు భాకీ ఉన్న రూ.12 వేలు ముందుగా రైతుల ఖాతాలో జమా చేస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పంటల బీమా పథకం అమలు చేస్తామని ప్రకటించి ఇంత వరకు అమలు చేయడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశంలో పంటల బీమా పథకంను అమలు చేస్తామని ప్రకటించి, మాట తప్పడం జరిగిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన పథకాలను బంద్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
వికారాబాద్, గద్వాల్ జిల్లాలో రైతులు పంట భూములు తీసుకోరాదని పోరాటం చేస్తే బేడిలు వేసి జైల్లో పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు గుణపాఠం చెపేందుకు రైతులు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో రైతు రాజ్యం కాదు బేడీల రాజ్యం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములు కొనుగోలు చేసేందుకు రియల్ వ్యాపారులు వచ్చే వారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అవసరం కోసం భూములు అమ్మకం చేస్తామని తెలిపినా ఎవరు ముందుకు రావడం లేదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఒక పైసా ఇవ్వలేదు..
సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్‌కు రావడంతో ఎమ్మెల్యే మాణిక్‌రావు నియోజకవర్గ అభివృద్ది కోసం గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయాలని కోరిన ఒక పైసా ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎక్కడికి పోయినా ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.30 లక్షలకుపైగా నిధులు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఒక ఎమ్మెల్యే ఆడిగిన నిధులు మంజూరు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గ్రామా పంచాయతీలకు ట్రాక్టరులు పంపిణి చేస్తే డీజీల్‌కు పైసాలు లేక పనులు చేయడం లేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులను మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, జహీరాబాద్, దుబ్లాక, నర్సాపూర్ ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతరెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేంటర్ ఆదర్శరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్, బాల్‌రెడ్డి, మాణిక్యం, తొంట అంజయ్య, సోమిరెడ్డి, చంద్రాగౌడ్, ఐలాపూర్ మాణిక్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్