Rajendra Prasad | నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన నోటి దురుసుతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ ప్రధానోత్సవ వేదికపై ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారింది. దివంగత నటుడు కాంతారావు గొప్పదనాన్ని వివరించే క్రమంలో, తమిళ ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ (M.G. Ramachandran) పట్ల ఆయన వాడిన పదజాలం తీవ్ర అభ్యంతరకరంగా ఉందనే విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. కాంతారావు గారి జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ భయపడి ‘ఉచ్చ పోసుకునేవాడు’ అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఆ కాలంలో కాంతారావు నటనను చూసి ఎంజీఆర్ వణికిపోయేవాడని, ఎవడ్రా వీడు ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు అని భయపడేవాడంటూ రాజేంద్ర ప్రసాద్ అగౌరవంగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యంగా తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక లెజెండరీ నటుడిని గౌరవించే క్రమంలో, మరొక దిగ్గజ నటుడిని, కోట్ల మంది ఆరాధించే నాయకుడిని తక్కువ చేసి మాట్లాడటం రాజేంద్ర ప్రసాద్ సంస్కారానికి తగదని విమర్శకులు మండిపడుతున్నారు. గతంలో కూడా బ్రహ్మానందం, అలీ వంటి సహ నటులపై రాజేంద్ర ప్రసాద్ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన ఒక సీనియర్ నటుడు, బహిరంగ వేదికలపై ఇలాంటి పదజాలాన్ని వాడటం పట్ల అటు సినీ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.