రాజాపేట, మార్చి 10 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేట ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ చందా రమేశ్ అధ్యక్షతన సర్పంచులు, ప్రధానోపాధ్యాయుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సర్పంచులను కోరారు. ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనంతో పాటు వైద్య ఆరోగ్య విషయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మండలంలో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు.
పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు. పిల్లలు సెల్ఫోన్ వాడకుండా చదువుపై దృష్టి సారించే విధంగా చూడాలని, అందుకు తల్లిదండ్రులకూ అవగాహన కల్పించాలన్నారు. తరగతికొక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చిన్నతనం నుండే పిల్లలకు నైతిక విద్య పాఠశాలల్లో నేర్పిస్తే సమ సమాజ నిర్మాణం సిద్ధిస్తుందన్నారు. ప్రతి పాఠశాల భౌతిక, మౌలిక వసతులతో కళకళలాడేలా సర్పంచులు చూడాలన్నారు. విద్యతోనే మార్పు వస్తుందని ప్రజల ఆలోచన విధానంలో మార్పు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రంగా నరేశ్, పల్లె సంతోష్, కోయ మధు, చింతల సంపత్, ఎం.జ్యోతి, జి.అనూష, ఎన్.నరేశ్ పాల్గొన్నారు.