హైదరాబాద్, ఆగస్టు 2: (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పింఛన్ అత్తకే ఇస్తున్నది.. కోడలుకు ఇస్తలేదు. మేము అధికారంలోకి వస్తే అత్తాకోడలు ఇద్దరికీ ఇస్తాం. ఇచ్చే రూ.2 వేల పింఛన్ రూ.4 వేలకు పెంచుతాం. వికలాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతాం’ – అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలివి. కాంగ్రెస్ మ్యానిఫెస్టో, ఆరు గ్యారెంటీల్లోనూ ఇవే హామీలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా పింఛన్ల మొత్తాన్ని పెంచడం లేదు. పైగా ఉన్న పింఛన్లకు వివిధ కారణాలతో కోత పెడుతున్నారు. కొత్త పింఛన్లు ఇస్తామని ఎప్పటికప్పుడు తేదీలు ప్రకటించడం, వాయిదా వేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఆగస్టు 15 నుంచి కొత్తగా పింఛన్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
గడిచిన రెండున్నరేండ్ల గణాంకాలను పరిశీలిస్తే, సుమారు 1.7 లక్షల మందికిపైగా లబ్ధిదారులు పథకం నుంచి దూరమైనట్టు తెలుస్తున్నది. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సరార్, ఆసరా పింఛన్ల పేరును చేయూతగా మార్చి లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెడుతున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నేరుగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో లబ్ధిదారులు పింఛన్లు పొందుతుండగా, మరికొందరు ఆన్లైన్లో తీసుకుంటున్నారు. పంద్రాగస్టు నుంచి కొత్త పింఛన్ల పంపిణీ చేపడుతామని సీఎం రేవంత్ ప్రకటించిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీడీఎస్ లైవ్‌నెస్ అథెంటికేషన్ (లైఫ్ సర్టిఫికెట్) గణాంకాలు ఆందోళనకర వాస్తవాలను బయటపెట్టాయి.
రాష్ట్రవ్యాప్తంగా 19,04,239 మంది పింఛన్ లబ్ధిదారుల్లో 1,76,328 మంది (7.33 శాతం) ఇంకా ధ్రువీకరణ పూర్తిచేయలేదని తెలిసింది. ఆధార్, బయోమెట్రిక్ సమస్యలు, ఇతర కారణాలతో వేలాది మంది ధ్రువీకరణకు దూరమయ్యారు. ధృవీకరణ పూర్తికాని ప్రతి ఒకరూ నిజంగా అనర్హులేనా? లేక సాంకేతిక సమస్యలు, ఆధార్ లోపాలు, వేలిముద్రలు పనిచేయకపోవడం వంటి కారణాలతో అర్హులు సైతం జాబితా నుంచి తప్పిపోనున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పింఛన్లను పెంచుతామని బీఆర్ఎస్ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వృద్ధులు, వితంతు పింఛన్లను రూ.200 నుంచి రూ.1,000, వికలాంగులకు రూ.500 నుంచి రూ.1,500కు నాటి సీఎం కేసీఆర్ పెంచారు. రెండోసారి ఎన్నిక సమయంలో మరోసారి పింఛన్లను పెంచుతామని ప్రకటించి.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,016, వికలాంగులకు రూ.1,500 నుంచి 3,016కు పెంచారు.
ఈ పథకం కోసం 2019-20లో రూ.9,402 కోట్లు కేటాయించగా, 2020-21 బడ్జెట్ లో రూ. 2,356 కోట్లు పెంచి రూ.11,758 కోట్లు కేటాయించారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేనాటికి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, గీత, బీడి కార్మికులు, హెచ్ఐవీ – ఎయిడ్స్ రోగులు ఇలా సుమారు 42 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఎన్నికల్లో హామీ ఇవ్వడమే తప్ప అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మరణించినట్లు నమోదైన వారు
76,372 మంది
ఆచూకీ లేని వారిగా నమోదు
45,134మంది
రాష్ట్రం వెలుపల ఉన్నవారు
6,064మంది
ఆసక్తి చూపలేదని నమోదు
1,248మంది
ధ్రువీకరణ పూర్తిచేయని వారు 1.76 లక్షల మంది