ఘటసంభృత మాకాశం లీయమానే ఘటే యథా
ఘటో లీయేత నాకాశం తద్వజ్జీవో నభోపమః 13
(అమృతబిందు ఉపనిషత్తు)
‘కుండ మాత్రమే తీసుకుపోతున్నారు అందులోని ఆకాశాన్ని కాదు. అలాగే జీవుడు ఆకాశం లాంటివాడు (అతను చిదాకాశ స్వరూపుడు) అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. దీన్ని నిరూపించే అద్భుతమైన సన్నివేశం అల్లమ ప్రభువు జీవితంలో కనిపిస్తుంది. ఆయన 12వ శతాబ్దంలో కర్ణాటకలో గొప్ప శివభక్తుడు. ఆయనకు ఒక మహాత్ముడు ఒక మహిమగల శివలింగాన్ని ప్రసాదించాడు. దాన్ని ఆరాధిస్తూ మహా సిద్ధుడైన అల్లమ ప్రభువుకు ఒకసారి ఒక సాధువు కత్తి పట్టుకుని ఒక నదీ తీరాన తారసపడ్డాడు. ఆయన యోగ సాధనతో కాయసిద్ధి సాధించిన వాడు. అంటే శరీరాన్ని శిలా సదృశంగా మార్చుకున్నాడు. ముసలితనాన్ని జయించినాడు. అదే ఆయనకు గర్వకారణం. ‘నేనే నిజమైన యోగిని. ఈ కత్తితో నా తలమీద బలంగా కొట్టు.. తెలుస్తుంది’ అన్నాడు. అల్లమ ప్రభువు కొట్టగానే రాయికి తగిలినట్టు ఖంగుమన్నది కత్తి.
అప్పుడు అతను ‘చూశావా! ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నువ్వూ ఇలాగ చేయగలవా!’ అని సవాలు చేశాడు. అల్లమ ప్రభువు నవ్వుతూ ‘నువ్వు కూడా కత్తిని నా తలపై ప్రయోగించు’ అన్నాడు. అతను బలంగా కనిపించనందువల్ల సాధువు అనుమానించాడు. ‘ఏం పర్వాలేదు. కొట్టు’ అన్నాడు అల్లమ ప్రభువు. సాధువు రెండు చేతులతో కత్తిని బలంగా ఎత్తి అల్లమ ప్రభువు శిరస్సు మీద మోదాడు. కానీ, కత్తి గాలిలో దూసుకుపోతూ భూమిని తాకింది. సాధువు కంగారుపడుతూ కత్తితోపాటు నేలమీద పడిపోయాడు. వెంటనే లేచి చెక్కుచెదరని అల్లమ ప్రభువును చూసి విస్తుపోయి ఇదేమిటని అడిగాడు. ‘ఏదైతే లేదని నీవు అనుకుంటున్నావో అదే ఇది. ఇదే శివతత్వం. అందులోని ఆకాశతత్వం’ అన్నాడు. సాధువు అల్లమ ప్రభువుకు పాదాక్రాంతుడు అవుతాడు. పరమేశ్వరుడు పంచభూతాలుగా ఐదు చోట్ల వెలిశాడు. చిదంబరంలోనిది ఆకాశ లింగం. ఆలయంలో తెర తీయగానే గర్భగుడిలో ఖాళీగా ఉంటుంది. అంటే నిరాకారం. అందుకే అల్లమ ప్రభువు శరీరం గుండా శూన్యంలోకిలాగా కత్తి దూసుకుపోయింది. అందుకే జీవుడు ఆకాశంలాగా ఉన్నాడన్నది ఉపనిషత్తు.