మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 2 : కల్లుగీత వృత్తిదారుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ విమర్శించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కల్లుగీత కార్మికుల చైతన్య యాత్ర బస్సును ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తిని నమ్ముకుని రాష్ట్రంలో ఐదు లక్షల మంది జీవిస్తున్నారని పేర్కొన్నారు. తాటి చెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు.
గతంలో మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.20 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు నిండిన గీత కార్మికులకు రూ.4 వేల పెన్షన్, గీత కార్మికులందరికీ కాటమయ్య కిట్లను అందజేయాలన్నారు. గీతన్నల చైతన్యయాత్ర ముగింపు ఈ నెల18న హైదరాబాద్లో ఉంటుందని, దీనికి ప్రతి ఒక్కరూ హాజరై విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్వాయి పాపన్న జైత్రయాత్ర పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు.