కట్టంగూర్, మార్చి 10 : అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి శ్వేత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో నల్లగొండకు చెందిన పొట్టబత్తుల వెంకట నరసయ్య, లక్ష్మమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు పొట్టబత్తుల శంకరయ్య–వెంకటమ్మ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే గర్భిణీలు, రోగులు, వారి బంధువులకు భోజన వసతి కల్పించడం ఎంతో అభినందనీయమని అన్నారు.
ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 250 మంది గర్భిణీలు, రోగులు, వారి బంధువులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్, కో ఆర్డినేటర్ రెడ్డిపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, సభ్యులు గోషిక ఉమాపతి, ఆకుల సోమేశ్వర్, బొడ్డుపల్లి వెంకన్న, జెల్లా అశోక్, చిట్టిపోలు మురళి, శ్యామల తుకారాం, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.