BC Reservations | జహీరాబాద్, నవంబర్ 19 : బీసీలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి విభాగం ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు జట్గొండ మారుతి మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రమైన న్యాల్కల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని, చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి బీసీల పట్ల కపట ప్రేమ చూస్తున్నారని తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస జ్ఞానం లేదని, రెండున్నర కోట్ల బీసీల మనోభావాలతో చెలగాటం ఆడుతూ వారిని రాజకీయ అస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కేవలం బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారని గుర్తుచేశారు.
మోదీ బడే భాయ్ ముందు మోకరిల్లిన రేవంత్ రెడ్డి..
కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం కోర్టులో నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందన్నారు. కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుపాలన్నారు. మోదీ బడే భాయ్ ముందు రేవంత్ రెడ్డి మోకరిల్లారని.. బీసీల పట్ల రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే ఒక్కసారి కూడా ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి ఎందుకు చర్చించలేదన్నారు.
అడుగడుగునా చేసినదంతా మోసం..
42% బీసీ రిజర్వేషన్ల అమలులో చట్టబద్ధతలను సీఎం రేవంత్ రెడ్డి పరిగణనలోకి తీసుకోలేదని.. తెలంగాణ సీఎం రాజకీయంగా, పరిపాలనాపరంగా, ఆర్థికంగా విఫలమయ్యారు. కులగణనను మొదలుకుని జీవో దాకా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో అడుగడుగునా చేసినదంతా మోసం, దగా, నయవంచన తప్ప మరొకటి లేదన్నారు. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సింది పోయి, ఏకపక్షంగా దేశ రాజధానికి వెళ్లి ధర్నా పేరిట కేవలం నాటకాలాడారని తప్పుపట్టారు.
రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ లో ఉండగానే ఆర్డినెన్స్ పేరిట కొంతకాలం హంగామా చేసి.. న్యాయస్థానాల్లో నిలబడని జీఓతో కేవలం బీసీల ఓటు బ్యాంకు కోసం రేవంత్ రెడ్డి మభ్యపెట్టారని ఆయన అన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కి, పార్టీ పరంగా ఇస్తామని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చిన నాడే కాంగ్రెస్ మోసం బయటపడిందన్నారు. సర్పంచ్ ఎన్నికలో పార్టీ గుర్తులే ఉండనపుడు కాంగ్రెస్ పార్టీ ఎలా పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు.
2 సంవత్సరాలు కాలయాపన..
గ్రామ సర్పంచ్ ఎన్నికలను నిర్వహించకుండా 2 సంవత్సరాలు కాలయాపన చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఇప్పటికే పల్లెల్లో పాలన పడకేసి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని జట్గొండ మారుతి సవాలు విసిరారు.
పార్లమెంట్లో రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు బీసీ రిజర్వేషన్లపై ఎందుకు ప్రస్తావన చేయలేదని తప్పుపట్టారు. రాజ్యాంగ సవరణ చేసి, తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.
రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఢిల్లీలో పోరాడాలన్నారు. బీసీలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ల లో ఒక్క శాతం రిజర్వేషన్ వెనక్కు పోయినా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జట్గొండ మారుతి హెచ్చరించారు.
Irregularities | వే బ్రిడ్జిలో అవకతవకలు.. రైస్‌మిల్లును మూసేయాలని రైతుల డిమాండ్
Shaligouraram : మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మందుల సామేల్
AI Course | యువత కోసం ఫ్రీ AI కోర్స్.. పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్