మాగనూరు : వ్యాపారులు, రైస్ మిల్లర్లు రైతులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. ఏ కాస్త సందు దొరికినా నిండా ముంచేస్తున్నారు. ఇప్పటికే అటు ప్రకృతి, ఇటు ప్రభుత్వం అన్నదాతలపై పగబట్టి నష్టాలపాలు చేయగా నేడు రైస్ మిల్లులు ( Ricemills) అవకతవకలకు పాల్పడుతూ రైతులను మోసం చేస్తున్నారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో (MSR Rice Mill ) వే బ్రిడ్జి ( Way bridge) నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు, వర్కూరు, నేరేడుగం గ్రామ రైతులు ఆరోపించారు. ఈ నెల 4, 5 వ తేదీల్లో్ రైస్ మిల్లులో వే-బ్రిడ్జి కాంటాలో అవకతవకలు జరుగుతున్నాయని ఒక్కో రైతు నుంచి క్వింటాళ్ల కొద్ది ధాన్యం కటింగ్ చేస్తూ ట్రక్ షీట్లు రాస్తున్నారని జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
దీంతో రైస్ మిల్లుపై సంబంధిత సివిల్ సప్లయ్, తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఆ రైస్ మిల్లు పై కేసులు నమోదు చేశారు. అయినా కూడా ఈ రైస్ మిల్ యజమాని నిర్వహణలో ఏమాత్రం మార్పు లేకుండా రైస్‌మిల్లును యథావిధిగా కొనసాగిస్తున్నారని రైతులు మండిపడ్డారు.

ఒక్కొక్క రైతు నుంచి ఒక టన్ను నుంచి క్వింటాళ్ల వరకు వరి ధాన్యాన్ని తక్కువ చూపి ట్రక్ షీట్లలో దాదాపు 30 నుంచి 40 బస్తాలు తక్కువ రాస్తున్నారని వర్కూర్ గ్రామానికి చెందిన మాషా మొల్ల నరసింహ అనే రైతు ఆరోపించారు. 523 బ్యాగులతో కూడిన లారీని సుబ్రేశ్వర రైస్ మిల్లులో వే బ్రిడ్జిలో వేయిస్తే 31 టన్నుల 260 కిలోలు వరి ధాన్యం తూకం రాగా అదే లారీని ఎంఎస్ఆర్ ఇండస్ట్రీ వే-బ్రిడ్జిలో తూకం వేయిస్తే 31 టన్నుల 70 కిలోలుగా వచ్చిందని ఆరోపించాడు. దాదాపు రెండు క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం తక్కువగా చూపించడంతో మళ్లీ ఈ తంతాంగం బయటికి వచ్చింది.
వర్కూర్, నేరడగం గ్రామ రైతులు తిప్పయ్య, భాస్కర్, రవి, మైపాల్ రెడ్డి, నవీన్ రెడ్డి, తాయప్ప, అశోక్ రెడ్డి, కురువ తమన్నా, తదితర రైతులు రైస్ మిల్ దగ్గరకు చేరుకొని వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆధారాలతో రైస్ మిల్ యజమానిపై మండిపడ్డారు. సివిల్ సప్లయ్, తూనికల శాఖ అధికారులు మిల్లు యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా తనిఖీలు చేపట్టి యథావిధిగా రైస్‌మిల్ నడిచేలా అనుమతులు ఇవ్వడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రైతులు ఆరోపించారు.
రైస్ మిల్ యజమాని మద్దూరు మండలంలో రైస్‌మిల్ నిర్వహిస్తూ భారీ స్కామ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రైస్ మిల్లు నిర్వాహణ కొనసాగిస్తున్నాడని రైతులు పేర్కొన్నారు. వెంటనే ఎంఎస్ఆర్ రైస్ మిల్లును సీజ్ చేయాలని జిల్లా సివిల్ సప్లై డీఎం సైదులు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఎం ఎస్ ఆర్ రైస్ మిల్లులో వడ్లు కొనుగోలు నిలిపివేయాలని అధికారులకు సూచించడంతో బుధవారం మాగనూరు తహసీల్దార్ సురేష్ కుమార్ రైస్ మిల్ సందర్శించి వడ్లను పరిశీలించారు. ఆ రైస్ మిల్ యజమాని అప్పటికే తనకు కేటాయించిన క్వాంటిటీ పూర్తి చేసుకుని ఉండడంతో రైస్ మిల్కు తాళం వేశారు.