Ketaki Sangameshwara Swamy Temple | ఝరాసంగం, ఏప్రిల్ 6: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పరిసరాలు కంపుకొడుతున్నాయి. ఆలయానికి అనునిత్యం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే ఈ పవిత్ర క్షేత్రం ఇప్పుడు దుర్గంధంతో నిండిపోయి, భక్తులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.
‘ఆలయ పరిసరాల్లోని వాలాద్రి వాగు నుంచి వెలువడుతున్న దుర్వాసన భక్తులను ముంచెత్తుతోంది. ఆలయం ముందు శివపార్వతుల విగ్రహాల సమీపంలో చెత్తాచెదారం కుప్పలుగా పేరుకుపోగా.. దోమలు, ఈగలు, పందులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ దృశ్యం చూస్తే ఎవరి గుండెలైనా బరువెక్కక తప్పదు. స్వామివారి సన్నిధిలో పది నిమిషాలు కూడా గడపలేకపోతున్నాం.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ముక్కును మూసుకుని వెళ్లిపోతున్నాం,” అంటూ ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒకప్పుడు ఈ ఆలయం భక్తులకు శాంతి, సంతోషాలను అందించగా, ఇప్పుడు దుర్వాసనతో వారి మనసులను కలుషితం చేస్తోంది. ఊర్లో నుండి ఆలయం వైపుకు వస్తున్న మురుగును వేరే వైపుకు దారి మళ్లించేలా చర్యలు తీసుకోని దుర్గంధం నుంచి విముక్తి కలిగించాలని భక్తులు కోరుకుంటున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రం కేవలం దుర్గంధ కేంద్రంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు దేవాదాయశాఖ అధికారులు స్పందించి కేతకీ ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటూ ఆలయానికి రెగ్యులర్ కార్యనిర్వాహణ అధికారిని నియమిస్తే ఆలయ అభివృద్ధికి దోహదపడుతుందనీ కొందరు భక్తులు అభిప్రాయం.
మంత్రి చెప్పిన మారనీ దుస్థితి..
కేతకి సంగమేశ్వర స్వామి వారిని శనివారం శనిఅమావాస్య రోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల పట్ల అసహనం వ్యక్తం చేసి వాటిని పరిష్కరించాలని చెప్పినా ఎక్కడికి కంపు అక్కడే ఉంది.. మంత్రి మాటలు కూడా లెక్క చేయకుండా ఆలయ నిర్వాహకుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
ఇదిలా ఉండగా నేడు కేతకి ఆలయ పాలక మండలి నియామకం ఉండటంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జహీరాబాద్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి చంద్రశేఖర్, స్థానిక నాయకులు వస్తున్నారని తెలిసినా అధికారుల పనితీరు ముందుకు కదలట్లేదు.