హైదరాబాద్: చోరీ చేసిన బైక్ విషయంలో జరిగిన గొడవ ఒకరి హత్యకు (Murder) దారితీసింది. దొంగతనంగా ఎత్తుకొచ్చిన బైక్‌ను అమ్మి తనకు వాటా ఇవ్వాలని ఒత్తిడిచేస్తున్న బావను బామ్మార్ది చంపేసిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గోల్కొండ ప్రాంతంలో నివసించే ముఖిత్, సమీర్ బావ బామ్మర్దులు. ముఖిత్ ఓ మోటారుసైకిల్‌ను దింగిలించాడు. దానిని అమ్మి తనకు డబ్బులు ఇవ్వాలని బామ్మర్ది సమీర్‌కు చెప్పాడు. ఆదివారం ఉదయం టోలిచౌకి నుంచి సెవెన్ టూంబ్స్ వెళ్లే రోడ్డులో ఉన్న ఓ హోటల్ వద్ద కలుసుకున్న ఇద్దరు ఆ డబ్బు విషయంలో వాదులాడుకున్నారు.
మాటామాట పెరిగి అదికాస్తా గొడవకు దారిసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సమీర్.. బావ ముఖిత్‌పై బ్లేడ్‌తో దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ముఖిత్ అక్కడే మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.