Cinnamon | దాల్చిన. చెక్కను మనం సాధారణంగా మసాలా వంటల్లో వేస్తుంటాం. ఇది లేకుండా మసాలా వంటకాలు పూర్తి కావు. శాకాహారం లేదా మాంసాహారం ఏది వండినా మసాలా అంటే మనకు ముందుగా దాల్చిన చెక్క గుర్తుకు వస్తుంది. అయితే ఆయుర్వేద ప్రకారం దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పలు అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు గాను దాల్చిన చెక్కను భిన్న రకాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. దీంతో మంచి ఫలితాలు ఉంటాయి. వాత సంబంధిత వ్యాధుల్లో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను తీసుకుంటే వాతం తగ్గిపోతుంది. శరీరంలో అధికంగా ఉండే నీటిని తొలగించడంలోనూ దాల్చిన చెక్క బాగానే పనిచేస్తుంది. మైగ్రేన్ ఉన్నవారు దాల్చిన చెక్క నీళ్లను తాగుతుంటే ఉపశమనం లభిస్తుంది.
స్వర పేటిక వాపు, గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలు ఉన్నవారు దాల్చిన చెక్కను బుగ్గన పెట్టుకుని నమిలి రసాన్ని మింగుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మహిళల్లో రుతు సమయంలో వచ్చే సమస్యలను తగ్గించడంలోనూ దాల్చిన చెక్క ప్రయోజనకారిగా ఉంటుంది. అధిక రక్త స్రావం అవకుండా నివారిస్తుంది. దాల్చిన చెక్కను తరచూ తింటే మహిళల్లో ఉండే గర్భ దోషాలు పోతాయి. గ్యాస్ సమస్య ఉన్నవారికి దాల్చిన చెక్క మంచి ఫలితాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలను సైతం తగ్గిస్తుంది. దాల్చినచెక్కను కాస్త ఉడకబెట్టి అందులో నెయ్యి, పటిక బెల్లం కలిపి తీసుకోవాలి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. దాల్చిన చెక్కలో ఉండే క్యాల్షియం, పీచు పదార్థం గుండెను సంరక్షిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
దాల్చిన చెక్కలో యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌తో పోరాడుతాయి. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. రక్తహీనతతో బాధపడేవారు దాల్చిన చెక్కను పొడిగా చేసి రోజూ తింటే మంచి ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్క చర్మానికి మేలు చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త దాల్చిన చెక్క పొడి, తేనె వేసి కలిపి రోజూ ఒకసారి సేవిస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. దాల్చిన చెక్క పొడిని గంధం, రోజ్ వాటర్‌తో కలిపి ఫేస్ ప్యాక్‌లా చేయాలి. దీన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారి మొటిమలు, మచ్చలు పోతాయి. దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రాత్రి పూట తింటున్నా కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
దాల్చిన చెక్క పొడిలో కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి రాస్తుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. రక్తహీనత తగ్గేందుకు దాల్చిన చెక్క పొడిలో దానిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడి, శొంఠి పొడి, జీలకర్ర పొడిని సమాన భాగాల్లో తీసుకుని అర టీస్పూన్ తేనెతో కలిపి రోజుకు 2 పూటలా తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. విరేచనాలు తగ్గుతాయి. దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, నల్ల జీలకర్రను సమానంగా తీసుకుని పొడి చేసి వాసన పీలుస్తుంటే కఫం కరిగిపోతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు పోయి గాలి బాగా ఆడుతుంది. దాల్చిన చెక్క, మిరియాలను కలిపి కషాయంలా చేసి తాగుతుంటే జలుబు త్వరగా తగ్గుతుంది. రాత్రి పూట ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కాస్త దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తాగుతుంటే మైండ్ రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది. ఇలా దాల్చిన చెక్కతో అనేక లాభాలను పొందవచ్చు.